జరుగుమల్లి : వైసిపి జరుగుమల్లి మండల కన్వీనర్ బాధ్యతలు దగ్గుమాటి శ్రీనివాసరావు(ఎన్ఆర్ఐ)కే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మండల కన్వీనర్ గా మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన జైబాబు ఇటీవల మరణించడంతో ఇక్కడ ఖాళీగా ఏర్పడింది. కన్వీనర్ కోసం వివిధ వర్గాలకు చెందిన నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు ఈనెల రెండవ వారంలో మండలంలోని ముఖ్యనాయకులతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన జరుగుమల్లి మండల నాయకులు కన్వీనర్ గా ఎన్ఆర్ఐ శ్రీనుకే బాధ్యతలు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే కన్వీనర్లుగా నియమించారని, ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనుకు ఇవ్వాలని కోరారు. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలలో పార్టీపై భరోసాతో పాటు కొత్త ఉత్సాహాన్ని నింపినట్లవుతుందని చెప్పారు. పార్టీ బలాన్ని పెంచుకుని రానున్న స్థానిక ఎన్నికలలో ఎక్కువ స్థానాలు సాదించుకోవచ్చని వివరించారు. బాలినేని కూడా ఎన్ఆర్ఐ శ్రీను అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తానని పూర్తి భరోసాగా మాట్లాడినట్లు మండల నాయకులు చెబుతున్నారు.
జరుగుమల్లి మండల కన్వీనర్ బాధ్యతలు ఎన్ఆర్ఐ శ్రీనుకు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బాలినేనిని కలిసిన ముఖ్యనాయకులు చెబుతున్నారు. ఐతే ఈసారి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా మండల కన్వీనర్ పదవి ఆశిస్తూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు బిసి సామాజిక వర్గానికి చెందిన వారిని ఇప్పటి వరకు కన్వీనర్ గా నియమించలేదు. బీసీ సామాజిక వర్గం నుండి మొదటిసారిగా మండలానికి చెందిన దగ్గుమాటి శ్రీనివాసరావు (ఎన్ఆర్ఐ) కన్వీనర్ బీసీలకే ఇవ్వాలని గట్టిగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుండి తన సొంత నిధులతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న తనకే కన్వీనర్ బాధ్యతలు ఇస్తారనే ధీమాతో ఉన్నట్లు శ్రీను తెలిపారు. ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు. గత పదేళ్లుగా మండలంలోని వైసిపిలో క్రియాశీల నాయకుడిగా పనిచేస్తున్నారు. వివాదాలకు దూరంగా అన్ని వర్గాల ప్రజలకు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నారు. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ పార్టీ శ్రేణులల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
బీసీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనుతో పాటు ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారు పోటీపడుతున్నారు. ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఏఒక్కరికి కన్వీనర్ ఇచ్చినా మరొకరు నొచ్చుకునే అవకాశం ఉన్నది. ఈసారి బీసీకి కన్వీనర్ అవకాశం ఇస్తే అన్నివర్గాల ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పడతారని చెబుతున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి కూడా ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నందున బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాసరావుకి జరుగుమల్లి మండల పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే మండలంతో పాటు నియోజకవర్గంలోని బీసీలు పార్టీకి ఆకర్షితులవుతారనడంలో సందేహం లేదు.