అమరావతి : చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఎపి సచివాలయం వద్ద టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం టిడిపిలో చేరారు. చీరాల మున్సిపల్ ఛైర్మన్‌పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్‌ను కోరిన నేపధ్యంలో జంజనం శ్రీనివాసరావు వైసిపి నుండి టిడిపిలో చేరడంతో రాజకీయ వాతావరణం అనూహ్యంగా మారింది. నిన్నటి వరకు జంజనం శ్రీనివాసరావును కాదని మరొకరికి ఛైర్మన్ ఇస్తారని పట్టణంలూ ఊహాగానాలు నడిచాయి. అనూహ్యంగా జంజనం శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయంతో ఊహాగానాలకు సమాధానం చెప్పకనే చెప్పినట్లయిందని చర్చిస్తున్నారు. తెలుగుదేశంలో చేరిన మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వెంట మిన్నెకంటి సుధాకర్, బండారు బాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.