టంగుటూరు (దమ్ము) : మహిళా పక్షపాతిగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దేశానికి ఆదర్శంగా ఉన్నారని వైసీపీ కొండపి ఇంచార్జ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ముందు జరిగిన వైస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు సభలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళ పొదుపు సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం వైస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేశారన్నారు.
భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ రూ.1860కోట్లతో వైస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. రక్తహీనత కారణంగా పేద మహిళలు చనిపోతున్నారనే ఉద్దేశంతో పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇంతకు ముందు రెండు కోడిగుడ్లు మాత్రమే ఇస్తుంటే ఇప్పుడు నెలకు 25కోడిగుడ్లు, పౌష్టికాహారం ఇస్తున్నారన్నారు. గర్భంతో ఉన్న ఆడవాళ్ళు మంచి ఆహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని అన్నారు. ఈ పథకం పేద తల్లిదండ్రులకు గొప్పవరం అన్నారు. అలాగే పేదలందరికీ ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో మహిళల పేరుమీద ఒక్కొక్కరికి 3లక్షల విలువచేసే 14వేల ఇళ్ల పథకాన్ని టీడీపీ వాళ్లు అడ్డంగా కోర్టుకెళ్లి నోటి కాడికి వచ్చిన పథకాన్ని ఆపివేశారన్నారు. అర్హులైన వాళ్లలందరికీ జగన్ ఇల్లు ఇవ్వాలని చూస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు మూడు వేల నుండి పదివేలకు జీతాలు పెంచారన్నారు. మహిళలకు ఎంతో ఉపయోగకరమైన అమ్మఒడి పథకం, మద్యపాన నిషేధం ముఖ్యంగా మద్యం రేట్లు పెంచి మద్యం అందుబాటులో ఉండకుండా చేశారన్నారు. దేశంలో, రాష్ట్రంలో చట్టాలపై నమ్మకం పోయిన సమయంలో చట్టాలు డబ్బున్న వాళ్ళకే చుట్టాలు అయిన పరిస్థితుల్లో మహిళను చూస్తేనే తాట తీయాలనే ఉద్దేశ్యంతో జగన్ దిశ చట్టం ప్రవేశపెట్టారన్నారు.
ఇతర రాష్ట్రాలలో దిశ చట్టాన్ని పెట్టాలని అక్కడి ప్రభుత్వాలను మహిళలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు వెళ్ళిపోతాను అని తెలిసి పసుపు కుంకుమ పేరుతో పదివేలు అకౌంట్లో వేశారని రాష్ట్రంలోని మహిళలలు తెలివిగా పసుపు కుంకుమ చంద్రబాబు ముఖానికి రుద్ది ఓడగొట్టారన్నారు. జగన్ మహిళలపై మంచి అవగాహనతో ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదని ఒక ప్రచారం చేస్తున్నారని జగన్ ముందు ప్రజల మాన ప్రాణాలు ముఖ్యమని వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గడిచిన 18నెలల కాలంలో నియోజకవర్గంలో రూ.220కోట్లతో రైతుబరోసా, సచివాలయ కేంద్రాల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. దళితులపై దాడులు చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. కారంచేడు దమనకాండ ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. దళితులపై జరిగిన శిరోముండనం, చీరాల ఘటనలపై జగన్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందన్నారు. స్పీకర్ తమ్మినేనిపై అక్రమ ఇసుక దారుడు, అవినీతిపరుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టిడిపి అవినీతిలో కూరుకుపోయింది కాబట్టే ఓడిపోయిందన్నారు. కరోనాను చూసి భయపడి ఇంట్లో కూర్చుని జూమ్ ముందు మాట్లాడటం కాదని, దమ్ముంటే బయటకు రావాలని, ప్రజల ముందుకు రావాలని ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. చంద్రబాబు, టిడిపి నాయకులు బయటికి వచ్చారా? ప్రజల బాధలు చూశారా? అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. మహిళలకు అన్ని విషయాలలో 50శాతం అమలు జరుపుతూ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు.
70ఏళ్ల చరిత్రలో ఒక దళితుడికి పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చిన ఘనత జగన్ కే చెందుతుందన్నారు. ఆ నమ్మకంతో 13వ స్థానంలో ఉన్న పీడీసీసీ బ్యాంక్ ని 5వ స్థానానికి తీసుకువచ్చానన్నారు. కరోనా మరణాలు ప్రపంచంలో 5నుండి 10శాతం, దేశంలో 2శాతం, అమెరికా లాంటి పెద్ద దేశంలో 5శాతం ఉంటే మన రాష్ట్రంలో ఒక శాతానికి తక్కువగా ఉందన్నారు. ఎక్కువగా కరోనా పరీక్షలు చేయడం వల్ల మరణాల శాతం తగ్గిందన్నారు. విద్య, వైద్యాన్ని ఒకప్పుడు చంద్రబాబు అంగట్లో సరుకులాగా అమ్మేస్తే, జగన్ విద్య, వైద్యాన్ని ప్రభుత్వపరంచేసి, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించాడన్నారు. అదే నమ్మకంతో ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లడం లేదన్నారు. బెడ్ లేక కింద పడుకునే స్థితి ఉన్నా ప్రభుత్వ రిమ్స్ వైద్యశాలలోనే చేరుతున్నారన్నారు.
కరోనా రాష్ట్రంలో విస్తరించింది అంటున్నారు. నిజం మాట్లాడాలని అబద్ధాలు మాట్లాడితే నోళ్లు పోతాయన్నారు. కరోనా రోగులకు మంచి వైద్యం, మంచి ఆహారం పెట్టి సొంతవారిలా చూసుకుంటున్నారన్నారు. గతంలో వైద్య పోస్ట్లు వెయ్యి ఇస్తామని, ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు 10 వేల పోస్టులు ఇచ్చారన్నారు. ఇది ముమ్మాటికి మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు.
ఏపీఎం మస్తానరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, టంగుటూరు సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, వల్లూరమ్మ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సూరం రమణారెడ్డి, చిడిపోతు సుబ్బారావు, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, ఆశాలత మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, గ్రామ వైసీపీ నాయకులు కురుగుంట్ల స్నేహలత, మల్లవరపు కోటిరెడ్డి, ఉప్పలపాటి సుబ్బరాజు, చిట్నీడి రంగారావు, బొడ్డపాటి అరుణ, డేవిడ్, కొమ్ము రమేష్, మన్నం హరిబాబు, కుంటా వెంకట్రావు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రాంబాబు, వైసీపీ నాయకులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు నుండి వచ్చిన స్పెషల్ పార్టీ, స్థానిక పోలీసుల పహరాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సింగరాయకొండ సిఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై శాంతిభద్రతలను పర్యవేక్షించారు.