అమరావతి : చంద్రబాబునాయుడుకు 23అంకె బాగా కలిసి వచ్చినట్లు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడికి 23వ తేదీనే దేవుడు 23 మంది ఎమ్మెల్యేలనే గిఫ్ట్‌గా ఇచ్చారంటూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. వైసిపి శాసనసభా పక్షం నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎంఎల్ఎలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. వైసిపికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు ఇప్పుడు భగవంతుడు ఆయనకు 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చాడన్నారు. ఇంతగొప్పగా దేవుడే రాతరాయగలడని చమత్కరించారు.
సిఎల్పీ నేతగా ఏకగ్రీవం
వైసిపి శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్‌ను వైసిపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైసిపి సీనియర్ నేత, జగన్ పక్కనే ఆశీనుడైన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సభ ముందు జగన్ పేరును ప్రతిపాదించారు. మరో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదనకు తొలి మద్దతు పలికారు. ఆ తరువాత శాసనసభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తనను శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు ఎంఎల్ఎలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.