– జగన్ రెడ్డి నాలుగేళ్లలో పంచబోయేది రూ.27వేల కోట్లు.
– టీడీపీ రెండేళ్లలో పంచినది రూ.18,500 కోట్లు.
– రుణాలు ఉన్నవారికే ఆసరా.
– డ్వాక్రా మహిళలందరికీ టిడిపి పసుపు కుంకుమ
ప్రకాశం (దమ్ము) : ఆసరా పథకం పేరుతో జగన్ కోటి మంది డ్వాక్రా మహిళలకు టోకరా వేశారని కొండపి శాసనసభ్యులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. టిడిపి హయాంలో రూపాయి కూడా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని ఆరోజు అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకుని అరిచి ఈ రోజు రూ.27వేల కోట్ల రుణాలు ఉన్నాయని అంటున్నారన్నారు. ఆ రుణాలు ఎవరి హయాంలో ఇచ్చారో జగన్ సమాధానం చెప్పగలరాని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రెండేళ్లలో పసుపు-కుంకుమ పథకం ద్వారానే ఏకంగా రూ.18,500కోట్లు చెల్లిస్తే జగన్ నాలుగేళ్లలో రూ.27వేల కోట్లు మాఫీ చేస్తానని అంటున్నారన్నారు. ఆ దామాషా ప్రకారం ఎవరు ఎక్కువ సాయం చేస్తున్నట్లు, రుణాలు తీసుకుని ఇంకా చెల్లించని వారికి మాత్రమే మీ ఆసరా వర్తిస్తుందే కానీ టీడీపీ హయాంలో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు తిరిగి చెల్లించాల్సిన అవసరమే లేకుండా ఏడాదికి రూ.10వేల చొప్పున ఇచ్చామన్నారు. దీని ప్రకారం ఎవరు ఎక్కువ చేసినట్లు అన్నారు.
టీడీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.3వేల కోట్లు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తామన్న జగన్ ఇచ్చింది ఎంతని ప్రశ్నించారు. మహిళలకు చెల్లించే సొమ్ముకు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని నాడు డిమాండ్ చేసిన మీరు నేడు ఆ రూ.27వేల కోట్లకు రూ.4వేల కోట్ల వడ్డీ సొమ్మును ఎందుకు చెల్లించడం లేదన్నారు. వడ్డీ రాయితీలను సకాలంలో చెల్లించకుండా, సకాలంలో రుణాలు మాఫీ చేయకుండా, మహిళలను వంచనతో మోసం చేస్తూ ఏదో చేసేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.
మీరు ప్రకటించిన ఆసరా పథకం ద్వారా మహిళలను వంచిస్తున్నారే తప్ప ఏమాత్రం కూడా వారికి న్యాయం చేయడం లేదన్నారు. మొన్నటికి మొన్న చేయూత ద్వారా అందించే సొమ్ముతో పాటు అమూల్, హెచ్యూఎల్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తామన్న మీరు ఇప్పటి వరకు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి పారిశ్రామికంగా అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలన్నారు. మాయ మాటలు చెబుతూ, మోసపూరిత ప్రకటనలు చేస్తూ మహిళా లోకాన్ని వంచించడం ఇకనైనా జగన్ మానుకోవాలని హితవుపలికారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.