Home ఆంధ్రప్రదేశ్ సీఎం.. జగన్… ప్రతిపక్ష నేత… చంద్రబాబు… ఇద్దరు…. ఒకే రోజు… ఒకే జిల్లాలో

సీఎం.. జగన్… ప్రతిపక్ష నేత… చంద్రబాబు… ఇద్దరు…. ఒకే రోజు… ఒకే జిల్లాలో

380
0

నెల్లూరు : ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ ఒకే ప్రాంతంలో రాజధాని కాకుండా ఇతర ప్రాంతాల్లో పర్యటన అరుదుగా ఉంటుంది. అటువంటి అరుదైన సంఘటనను మంగళవారం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఇద్దరు నేతలు ఒకేసారి పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం హోదాలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జిల్లాకు వచ్చారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా జిల్లాలో పర్యటించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో జిల్లాకు తొలిసారి వచ్చారు.

ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటిస్తుండటం ఆసక్తిగా మారినప్పటికీ భద్రతా రీత్యా పోలీసు యంత్రాంగంలో టెన్షన్‌ నెలకొంది. జిల్లాలలో పర్యటిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపే పనిలో ఉన్న చంద్రబాబు నెల్లూరు జిల్లాకు సోమవారమే వచ్చారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాలుగు నియోజక వర్గాలపై సమీక్ష చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి సూచనలు చేశారు.

సీఎం జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అమరావతి నుంచి వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీకి చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకం ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం జగన్ అమరావతికి తిరుగు పయనమవగా చంద్రబాబు మాత్రం సాయంత్రం ఆరు గంటలకు అమరావతికి వేళ్ళనున్నారు. ఇద్దరు నేతలు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇద్దరు నాయకుల కార్యక్రమాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.