అద్దంకి (DN5 News) : కార్పోరేట్ విద్యకు దీటుగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని ఏల్చూరు జెడ్‌పి ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని 454 మంది విద్యార్థినీ, విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులతో సైకిళ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 8వేల మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పూర్తి చేశామని అన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి సిఎస్ఆర్ నిధులు, దాతల సాయంతో మరో మూడు వేల సైకిళ్లను అందజేస్తామని అన్నారు. దూరాభారం, వ్యయ ప్రయాసల వలన విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ చేపట్టామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి విద్యార్థులు అందరికీ సైకిళ్లను అందిస్తామన్నారు. చదువుల్లో రాజకీయం ఉండకూడదనే, పార్టీ గుర్తులు లేకుండా విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16,300 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, తహశీల్దారు కె రవిబాబు, ఎంపిడిఒ జ్యోతిర్మయి, ఎఎంసి చైర్మన్ తేలప్రోలు రమేష్, సర్పంచ్ మందా సూరిబాబు, మాజి సొసైటీ అధ్యక్షులు డి గాలెయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షులు సన్నెబోయిన గురు యాదవ్, నక్కా వెంకటేశ్వర్లు, టి దేశింగరాజు పాల్గొన్నారు.






