బాపట్ల (DN5 News) : జిల్లాలో వైసిపి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని కేసులు బనాయిస్తున్నారని వైసిపి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. వైసిపి నాయకులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసెంబ్లీ ఇన్‌ఛార్జిలతో కలిసి శుక్రవారం ఎస్‌పికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రభుత్వాలు పాలకులు మారిన పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలే తప్ప వ్యక్తిగతంగా వైసిపిని టార్గెట్ చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పర్చూరు, రేపల్లె నియోజకవర్గాల్లో వైసిపి కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వినతిపత్రం పరిశీలించిన ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి బాపట్ల, రేపల్లె, పర్చూరు, వేమూరు ఇన్‌ఛార్జిలు కోన రఘుపతి, పీటా నాగ మోహనకృష్ణ, గాదె మధుసూదన్ రెడ్డి, వరికూటి అశోక్ బాబు, కోకి రాఘవరెడ్డి, వడ్డీముక్కల డేవిడ్, కోకిలగడ్డ చెంచయ్య, జోగి రాజా పాల్గొన్నారు.






