చీరాల : శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నూతన భవనంను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఎల్‌బిఎస్ నగర్‌లో నూతనంగా నిర్మించిన హాస్పిటల్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. చీరాల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. అల్ప ఆదాయ వర్గాలు నివాసం ఉంటున్న చీరాల వంటి పట్టణంలో ఇంతటి అధునాత వైద్య పరికరాలతో ఆధునిక హంగులతో చౌకగా వైద్యం అందిస్తూ ప్రజలు అభిమానం పొందాలని సూచించారు.
శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ చీరాల ప్రాంతంలో మొదటిసారి ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో తాము తెచ్చినట్లు తెలిపారు. నిన్నటి వరకు ఉడ్‌నగర్‌లో విజ్ఞాన భారతి కళాశాల ఎదురుగా ఉన్న తమ హాస్పిటల్‌ను ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరికరాలతో ఏరియా వైద్యశాల సమీపంలోని ఎల్‌బిఎస్ నగర్‌లో నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్నట్లు తెలిపారు. తమ హాస్పిటల్‌లో జనరల్, షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ గోరంట్ల రాజేష్, చిన్నపిల్లల వైద్యం నిపుణులు డాక్టర్ నన్నపనేని శ్రావణి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ గోరంట్ల కృష్ణ చైతన్య, ఐవిఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ మేడికొండ ప్రీతి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ కెవి సుబ్బారావు, మెదడు, నరముల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ శ్రీజ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.
బాపట్ల జిల్లాలోనే మొదటిసారిగా 100 పడకలతో 24 గంటలు మెదడు, నరముల వైద్య నిపుణులు, గుండె వైద్య నిపుణులు ఉంటారని తెలిపారు. షిమ్యాడ్యూ క్యాథ్ ల్యాబ్, 32 స్లైడ్ సిటి స్కాన్, 24 గంటలు డయాలసిస్ సౌకర్యంతో పాటు అన్ని అత్యవసర, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి వైద్యం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఒ విజయమ్మ, స్థానిక వైద్యలు పాల్గొన్నారు.