చీరాల : మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులతో పేరాల ఏఆర్ఎమ్ ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ ఫజుల్లుళ్ళ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ చదువుకుంటేనే పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. పిల్లలు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అన్నారు. మన రాష్ట్రంలో ఉత్తీర్ణతా శాతం పెరిగిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడం పట్ల ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను ఎందుకు తల్లిదండ్రులు చేరుస్తున్నారో, ప్రైవేట్ విద్యాసంస్థలు కంటే మనం ఎక్కువ వసతులు కల్పిస్తున్న ఎందుకు రావట్లేదో అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కనీసం వారానికి ఒక్కసారి అయిన సరే తల్లితండ్రలు, ఉపాధ్యాయులు కలిసి ఒక ఐడియాలజీని రూపొందించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జీఓ నంబర్ 1, 42లను అమలు చేయకపోయినా ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు వారి చేసే పోరాటాల్లో ప్రశ్నించడం లేదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ జీఓ లపైన ప్రశ్నించాలని కోరారు.
2019-20విద్యాసంవత్సరానికి ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలి అని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మొదడుగు రమేష్బాబు, ఏఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్ జి సత్యనారాయణ, పి వెంకటేశ్వరబాబు, సాల్మన్ రాజ్, వెంకేటేశ్వర్లు ,విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.