బాపట్ల (DN5 News) : జిల్లాలో పి4 స్పూర్తితో అమలు అవుతున్న ‘సేవా సేతు’ కార్యక్రమం అభినందనీయమని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ (PiyushKumar IAS) పేర్కొన్నారు. పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కెపిఐ), పి4 కార్యక్రమాలపై అమరావతి నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు, ముఖ్య ప్రణాళిక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సివిఎపి, డివిఎపి బృందాలు, యంగ్ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లాలో అమలు చేస్తున్న చర్యలు వివరించారు.
పి4 కింద చేపడుతున్న ‘బాపట్ల సేవా సేతు’ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాల గుర్తింపు, దత్తత, ధృవీకరణ విధానాలు పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా సీవీఏపీ, డివిఏపీ బృందాల సమన్వయం, మౌలిక వసతుల వినియోగంపై సమగ్ర వివరాలు అందించారు. జిల్లా కెపిఐలో 83 స్కోర్ సాధించి ‘ఏ’ గ్రేడ్ పొందగా, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు 85–87 మధ్య స్కోర్లు సాధించినట్లు వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ అన్ని జిల్లాలు నెలవారీ, వారం వారీ సమీక్షలు నిర్వహించి ప్రతి నియోజకవర్గాన్ని ‘ఏ ప్లస్’ గ్రేడ్ దిశగా తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీపీఓ సాల్మన్ రాజు పాల్గొన్నారు.






