అద్దంకి (DN5 News) : ఎపిలో ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పారిశ్రామిక రాయితీలు తక్షణం విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఈడ్పుగంటి అనార్ బాబు డిమాండ్ చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం అద్దంకి విచ్చేసిన ఆయన స్థానిక ఆర్డీఒ జాన్సన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఒ జాన్సన్ మాట్లాడుతూ వినతి పత్రాన్ని పరిశ్రమల శాఖకు పంపిస్తామని తెలిపారు. అనంతరం అనార్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది పారిశ్రామిక వేత్తలకు రూ.700 కోట్ల రాయితీలు రావాల్సి ఉందన్నారు.
గత ఐదేళ్లుగా రాయితీలు లేక ఈ వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా వివిధ రూపాలలో తాము ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం విడుదల చేసి చేతులు దులుపుకున్నట్లు తెలిపారు. మిగిలిన 80శాతం రాయితీల కోసం ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈపాటికే సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు, పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్, కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యువరాజ్, కమిషనర్ శుభం బన్సల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.
మూడు సార్లు సచివాలయం ముట్టడి, అనేకసార్లు మంగళగిరిలోని ఎపిఐఐసి వద్ద ఆందోళన చేశామని అన్నారు. త్వరలో సమస్య పరిష్కరించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఉద్యమాన్ని జిల్లా, డివిజన్ల స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. మొదటి తరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వివిధ పరిశ్రమలు స్థాపించి, వాహనాలు కొనుగోలు చేసి ఇటు ఉపాధి కల్పిస్తూ, అటు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నప్పటికీ ప్రభుత్వం కనికరించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాయితీలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కో ఆర్డినేటర్ వి భక్తవత్సలం, జెఎసి నాయకులు విజయరాజు, రాంబాబు, వెంకటరావు, పలువురు పారిశ్రామికవేత్తలు నరసింహారావు, వెంకటేశ్వర్లు, కత్తి సుబ్బారావు, రాజు, ఆదినారాయణ పాల్గొన్నారు.






