అమరావతి : టిడిపి ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడితో తన ఫోన్ కాల్ సంభాషణను ఎంపీలకు వివరించినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదాపై తాము తీసుకున్న నిర్ణయంపై వివిధ పార్టీల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లు ఎంపిలతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. ఈసందర్భంగా ఎంపిలు మాట్లాడుతూ టిడిపి నిర్ణయాన్ని అన్ని పార్టీలు ప్రశంసించాయని బాబుకు చెప్పారు. ఏపికి సహకరించేందుకు అనేక పార్టీలు ముందుకువచ్చాయని ఎంపిలు సిఎంకు వివరించారని తెలిసింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్ని పార్టీల నేతలు టిడిపి నిర్ణయాన్ని అభినందించినట్లు ఎంపిలు సిఎం దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కుగా ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు ఎంపిలకు వివరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రజల హక్కులు కాపాడటంలో రాజీలేదని చెప్పారు.
దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలంటే రాష్ట్రంలో టిడిపి శాశ్వతంగా అధికారంలో ఉంటేనే సాధ్యమని ఎంపిలతో చంద్రబాబు అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వృద్ధిరేటు 11.22% ఉందన్నారు. నాలుగేళ్ల సగటు చూసినా అన్ని రాష్ట్రాలకన్నా ఎపి వృద్ది రేటు అధికమన్నారు. నాలుగేళ్లలో మనం చేసినన్ని పనులు ఎవరూ చేయలేదని ఎంపిలతో బాబు అన్నారు. జాతీయవృద్ధికి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూట్ చేస్తొందని పేర్కొన్నారు. జాతీయవృద్ది 7% ఉంటే అందులో 11%వాటా ఏపిదేనని పేర్కొన్నారు. మనవి గొంతెమ్మ కోరికలు కాదు. చట్టంలో ఉన్నవే చేయముంటున్నాం. హామీలు నెరవేర్చమంటున్నాం. ఎవరూ సంయమనం కోల్పోరాదు. ఇతరులు తప్పుపట్టేలా మన వ్యాఖ్యలు ఉండరాదు. హుందాగా వ్యవహరించాలి. అంటూ చంద్రబాబు ఎంపిలకు సూచించినట్లు తెలిసింది. ప్రజల్లో సెంటిమెంట్‌ను కేంద్రం పట్టించుకోక పోవడమే ఇక్కడ సమస్య అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. ప్రజలందరూ ఎంపీల పోరాటాన్ని ప్రశంశిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో మనం చేయడం లేదు. ప్రత్యేక హోదా ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు ఒకహక్కుగా ప్రజలు భావిస్తున్నారు. ఇవ్వడంలో కేంద్రం ఆలస్యం చేసేకొద్దీ ఆ సెంటిమెంట్ పెరుగుతుంది. కేంద్ర మంత్రులతో ప్రధాని మోడి సంభాషణను వివరించిన మంత్రులు రానున్న రెండురోజులు సెలవులు వస్తున్నందున నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచించారు.
“ఇది అవకాశవాదం కాదు. రాజకీయ మైలేజి కోసం కాదు. రాజకీయ లబ్ది కోసమో, ఏ ఒక్కరి స్వార్ధం కోసమో కేంద్రం నుండి బైటకు రాలేదు. 5కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసమే కేంద్రం నుండి బైటకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిలకు వివరించారు. ఎప్పటికప్పుడు జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాలి“ అని సూచించారు. సకాలంలో సరైన నిర్ణయమనేదే రాజకీయాల్లో కీలకమన్నారు. ఆలస్యమైనా నష్టం జరుగుతుంది. తొందరబడ్డా కష్టం వస్తుంది. వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. జాతీయ రాజకీయాలు జగన్మోహనరెడ్డి దగ్గర నేర్చుకోవాల్నా..? 11కేసులలో ఏ1 నిందితుడిని టిడిపి ఫాలో కావాల్నా…? అంటూ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు.