బాపట్ల (DN5 News) : జిల్లాలో గృహనిర్మాణ పనులు వేగవంతం చేసి ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (VinodKumar IAS) అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని న్యూ వీసీ హాల్‌లో హౌసింగ్, పల్లెపండుగ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రతి లబ్ధిదారునికి సమయానికి గృహం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. అవసరమైన నిర్మాణ సామగ్రి సరఫరా, సాంకేతిక మార్గదర్శకాలు సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు.
పల్లెపండుగ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జిఎన్‌ఆర్‌ఈజిఎస్) నిధుల ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేయడం, చెరువులు, కాలువల శుభ్రత, మట్టి, నీటి సంరక్షణ, వృక్షారోపణ, గ్రామ రహదారుల మెరుగుదల, తాగునీటి వనరుల అభివృద్ధి వంటి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పల్లెపండుగ సందర్భంగా గ్రామాలను స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ పిడి వెంకటేశ్వరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఎంపిడిఒలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.






