Home క్రైమ్ 14ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం : విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె...

14ఏళ్ళ మైనర్ బాలికపై యువకుల అత్యాచారం : విస్తుపోయే నిజాలు వెల్లడించిన తెనాలి డిఎస్పి కె శ్రీలక్ష్మి

1044
0

గుంటూరు (తెనాలి): ఏపీలో మానవ మృగాల తీరు మారలేదు. మైనర్ బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. ముద్దాయిలను సర్కార్ కఠినంగా శిక్షించి సదరు వ్యక్తులపై 24గంటల్లో చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన కామాంధుల చెవికి ఎక్కడంలేదు.

వివరాల్లోకెళితే తెనాలి ముత్యంశెట్టిపాలెంకు చెందిన 14ఏళ్ల బాలికను గత నెల 26న కిడ్నాప్ చేసి రెండువారాలపాటు హత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అయితే కేసునమోదైన 24గంటల్లో తెనాలి పోలీసులు ఆ కేసును ఛేదించారు. ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి కె శ్రీలక్ష్మి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. పొన్నూరు సమీపంలోని కర్లపాలెం చెందిన నూతలపాటి నవీన్ కుమార్ పద్నాలుగేళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి చందోలు దగ్గర ఇంటూరు లాగు దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం తెనాలి వైకుంఠపురం దగ్గర వదిలి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో అర్థరాత్రి స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు ఆ మైనర్ బాలిక పేరేచర్ల చేరుకుంది. అదే సమయంలో హెం గార్డ్ అశోక చక్రవర్తి అతని స్నేహితుడు మైనర్ బాలిక వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బాలిక భయాందోళనకు గురి కావడంతో వెంటనే హోంగార్డ్ తన ఐడి కార్డు చూపించి భయపడాల్సిన అవసరం లేదని, తాను హోంగార్డ్ నని నమ్మించాడు. ఎక్కడికి వెళ్లాలో చెప్తే తాను తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. పోలీసు అని నమ్మిన ఆ మైనర్ బాలిక వివరాలు చెప్పింది. తదనంతరం ఆ బాలికను హోంగార్డు వాహనంపై తీసుకుని వెళ్లి ఒక గదిలో నిర్బంధించి, తనతోపాటు స్నేహితులతో కలిసి అతిక్రూరంగా రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ మైనర్ బాలిక మనోదైర్యాన్ని కోల్పోకుండా ఈనెల 13న వారి చెర నుండి తప్పించుకొని తెనాలిలోని తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది. జరిగిన సంఘటనలు తల్లిదండ్రులకు పూర్తిగా వివరించింది. కంగారుపడిన తల్లిదండ్రులు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కేసును ఛేదించారు. సదరు నిందితులు గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక చక్రవర్తి, అతని స్నేహితుడు దుర్గారావును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేశారు. విచారణలో నిందితులు చేసిన తప్పును ఒప్పుకున్నారు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై నిర్భయ, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పి కె శ్రీలక్ష్మి మీడియా సమావేశంలో తెలిపారు. ఏదిఏమైనా మహిళలు జాగ్రత్తగా ఉండాలని, బాలికలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రీలక్ష్మి హెచ్చరించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.