కందుకూరు: రాష్ట్రంలో మరోసారి టిడిపి గెలుపు చారిత్రక అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమ సభలో మాట్లాడారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాంటి తమ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైసిపిలో కొందరు అవినీతిపరులు తనను విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా ఒక దొంగ దొంగతనం చేసి జైలుకు వెళ్లి మళ్లీ బెయిల్‌పై ఇంటికి వచ్చి ఆ ఊళ్లో పెద్దమనిషిని అని చెప్పుకున్నట్లు ప్రతిపక్షాల విమర్శలు ఉన్నాయన్నారు. ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ఆ మాటలన్నీ ప్రజల కోసమే భరిస్తున్నట్లు చెప్పారు. పార్టీల విధానాలను చెప్పడం, ప్రజలకు ఏం చేశామో వివరిస్తూ వారిని చైతన్యపర్చడమే ప్రజాస్వామ్యంలో ముఖ్యం తప్ప చెప్పిన అబద్ధాలే మళ్లీమళ్లీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టిడిపి గెలుపు ఓ చారిత్రక అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్లో చర్చ జరగాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది దయాదాక్షిణ్యాపై కాదని, అతి రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సమర్థమైన, మెరుగైన పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంతో లాభం పొందే ప్రతి వ్యక్తీ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనునిత్యం వారు ప్రభుత్వం గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ధర్మపోరాటం కొనసాగించాలని, హక్కులను సాధించాలనే ఆవేశం, ఆలోచన అనునిత్యం రావాలని చంద్రబాబు అన్నారు.