Home ప్రకాశం మైనింగ్ భూముల్ని ఇళ్లస్థలాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే

మైనింగ్ భూముల్ని ఇళ్లస్థలాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే

242
0

ప్రకాశం : జిల్లాలోని మైనింగ్ భూముల్ని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది. మైనింగ్ భూముల్ని ఇతర అవసరాలకు వినియోగించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు గ్రామీణం, టంగుటూరు మండలంలోని కొణిజేడు, సర్వేరెడ్డిపాలెం, యరజర్ల, కందులూరు, టంగుటూరు గ్రామాల్లోని ఐరన్ ఓర్ భూముల్ని ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. మైన్స్, మినరల్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957ప్రకారం మైనింగ్ భూముల్ని ఇండ్లస్థలాలకు కేటాయించడం చట్టవిరుద్దమని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ తరహా భూముల్ని పేదల ఇండ్లస్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు స్టే విధించి, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

వివరాలలోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్లస్థలాల కేటాయింపులో భాగంగా ఒంగోలు నగరానికి చెందిన 22వేల మంది పేదలకు నివేశ స్థలాలు పంపిణీ చేయడానికి ఒంగోలు రూరల్, టంగుటూరు మండల రెవెన్యూ పరిధిలోని సర్వేరెడ్డిపాలెంలో 105, కొణిజేడులో 296, యర్రజర్లలో 160, మర్లపాడులో 110ఎకరాల కొండప్రాంతానికి చెందిన ప్రభుత్వ మైనింగ్ భూమిని ఇండ్లస్థలాలకు కేటాయించి ఇప్పటికే ఆ భూమిలో లే ఔట్లు వేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మెరక తొలడంతో పాటు, అంతర్గత రహదారుల నిర్మాణపనులు పూర్తిచేశారు. పట్టాల పంపిణీకి ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఐతే మైనింగ్ భూముల్లో నివేశ స్థలాలు కేటాయించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.