చీరాల : హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించటం చట్టరీత్యా నేరమని డిఎస్‌పి ఎండి మోయిన్ అన్నారు. ఎయిడ్స్ బాధితులకు హక్కులు ఉన్నయని అన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని పేర్కొన్నారు. ఎయిడ్స్ నిర్మూలన సమీకృత వ్యూహం (దిషా ) హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, టిఐ మహిళా మండలి ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ కుటుంబాలకు చెందిన బాలలను పాఠశాలలు, కళాశాలలో ఉమ్మడి కుటుంబాల్లో వారి పట్ల వివక్షత చూపించడం నేరమని చెప్పారు. వారి హక్కులకు భంగం కలిగించిన, హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు ఫోటోలు బహిర్గతం చేసిన శిక్షార్హలు అవుతారని చెప్పారు. చేతనైన సహాయ, సహకారాలు అందించాలని చెప్పారు. బాలల హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. హెల్ప్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణకు రూపొందించిన 2017 చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేసినప్పుడే ప్రయోజనం ఉంటుందని అన్నారు. వివక్షత చూపించిన వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐ వైవి రమణయ్య, ఎస్‌ఐ సురేష్, రమేష్, వెంకట్రావు, రైటర్ సుబ్బారావు, పోలీసు సిబ్బంది, చీరాల మహిళా మండలి ప్రోగ్రాం మేనేజర్ కె వెంకట్రావు పాల్గొన్నారు.