బాపట్ల : సేవా సేతు ద్వారా సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు రూ.30 వేలు విలువైన బల్లలు, మేట్స్, స్పోట్స్ కిట్లను కలెక్టర్ ద్వారా అందజేసినట్లు ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా అధ్యక్షులు సిహెచ్ బాబురావు తెలిపారు. ఎపిఆర్‌ఎస్‌ఎ నాయకులు పేద పిల్లలకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు బాపట్ల సేవా సేతు భరోసా కల్పిస్తుందని తెలిపారు. కలెక్టరేట్ నందు ఎపిఆర్‌ఎస్‌ఎ నాయకులతో కలసి చీరాలలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహానికి రూ.30 వేలు విలువైన 4 బెంచీలు, ౩౦ చాపలు, 4 షటిల్ బ్యాట్లు, నెట్, క్యారమ్ బోర్డు, వాలీ బాల్, నెట్లను అందజేశారు. బాపట్ల సేవా సేతు ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. జిల్లాలో పని చేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల తరపున రెవెన్యూ అసోసియేషన్ తమ విరాళాలు విద్యార్థినీలకు వినియోగించడం అభినందనీయమన్నారు. చీరాలలోని ఎస్‌సి బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థినిలకు రూ.30 వేలు విలువచేసే సామగ్రి ఇవ్వడం సంతోషదాయకం అన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వసిస్ట, ఇన్‌ఛార్జి డిఆర్ఓ ఎస్ లవన్న, ఎస్‌సి సంక్షేమ శాఖ అధికారి శివలీల, కలెక్టరేట్ ఎఒ మల్లికార్జున్, రెవెన్యూ అసోసియేషన్ చీరాల, బాపట్ల, రేపల్లె అధ్యక్షులు సురేష్ బాబు, కార్యదర్శి బి ఓంకార్ చీరాల డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, తహశీల్దారు కె గోపి కృష్ణ, సిటీ యూనిట్ ఆధ్యక్షులు ఎస్‌కె మహబూబ్ బాషా, కార్యదర్శి సుమంత్ రాజ్, బి శ్రీనివాసరావ్ పాల్గొన్నారు.




