Home బాపట్ల శిరోరక్ష – ప్రాణ రక్ష: హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ

శిరోరక్ష – ప్రాణ రక్ష: హెల్మెట్ ధారణపై అవగాహన ర్యాలీ

13
0

చీరాల (DN5 News) : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో పోలీ’i యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీ బి ఉమామహేశ్వర్, చీరాల సబ్ డివిజన్ పరిధిలో ‘శిరోరక్ష – ప్రాణ రక్ష’ పేరుతో భారీ అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బంది, హోంగార్డులు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ర్యాలీలో ఎస్పీ ఉమామహేశ్వర్‌తో పాటు డిఎస్పి మోయిన్, సబ్ డివిజన్ సిఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం తలకు తగిలే గాయాలేనని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి 90శాతం వరకు తప్పించుకోవచ్చని పోలీసులు ప్రజలకు వివరించారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రమాదాలు విశ్లేషిస్తే, హెల్మెట్ లేకపోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అందుకే వచ్చే 10 నుండి 15 రోజుల పాటు విద్యార్థులు, యువత, ప్రభుత్వ సిబ్బంది, సామాన్య ప్రజల్లో హెల్మెట్ ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పిస్తామని అన్నారు.

కేవలం చట్టం కోసమో, జరిమానాల కోసమో కాకుండా, మీ కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ ధరించాలని కోరారు. పోలీసు శాఖ నుండే ఈ మార్పు మొదలు కావాలని, సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించారు.
రానున్న రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. బాపట్ల జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమం ద్వారా పోలీసులు సామాజిక బాధ్యతను చాటుకుంటూ, ప్రజల ప్రాణాల రక్షణకు పెద్దపీట వేశారు. కార్యక్రమంలో ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీ మోయిన్, వన్ టౌన్ సిఐ ఎస్ సుబ్బారావు, టూ టౌన్ అశోక్ కుమార్, రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఈపూరుపాలెం ఎస్‌ఐ చంద్రశేఖర్, వేటపాలెం ఎస్‌ఐ జనార్దన్, ఇంకొల్లు సీఐ వైవి రమణయ్య, ఇంకోలు ఎస్‌ఐ సురేష్, చినగంజాం ఎస్‌ఐ రమేష్, కారంచేడు ఎస్‌ఐ ఖాదర్బాషా, చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్‌ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు.