సంతమాగులూరు (Santhamaguluru) : పల్నాడు (Palnadu) జిల్లా రొంపిచర్ల (Rompicharla) మండలం మాచవరం (Machavaram) గ్రామ పరిధిలో మహిళ దారుణ హత్య ఘటన ఆదివారం కలకలం రేపింది. మండలంలోని ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన అల్లడి వెంకటేష్‌కు మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మికి (28) తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేష్ బేకరీల్లో పనిచేస్తూ ఉంటాడు. వివాహమైన నాటి నుంచే వెంకటేష్ తోపాటు అతని అక్కలు రమణ, శబరి, తన అన్న శ్రీను మహాలక్ష్మిని వేధింపులకు గురి చేస్తూ వచ్చారని మహాలక్ష్మి తన తల్లికి తెలియజేసినట్లు సమాచారం. భర్త వెంకటేష్ అతని కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక మహాలక్ష్మి రెండు నెలల క్రితం తన పుట్టినిల్లు అయిన మాచవరంలోని తన తల్లి దగ్గరికి చేరింది.
వెంకటేష్ గత శనివారం రాత్రి మాచవరంలో ఉంటున్న తన భార్య మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. పిల్లలకు బంగారం కొన్నానని, తన పద్ధతి మార్చుకున్నామని, తిరిగి ఏల్చూరు మన ఇంటికి వెళదామని భార్యకు నచ్చ చెప్పాడు. ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో తన భార్య మహాలక్ష్మిని తన మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని రొంపిచర్ల గ్రామ సమీపాన ఉన్న ఎన్ఎస్‌పి కాలువ సమీపంలోకి రాగానే మహాలక్ష్మిని బైక్ మీద నుండి కింద పడవేసి ఆమె ధరించిన చలి కోటు లేస్‌తొ మెడకు బిగించి దారుణంగా హత్య చేసాడని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైకుపై వేసుకొని సంతమాగులూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి తానే తన భార్యను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు మృతురాలు బతికి ఉండవచ్చని భావించి ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం నిందితుడు అల్లడి వెంకటేష్ రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయాడు. ఈ ఘటనపై రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






