హైదరాబాద్ : ఛార్మీ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరుగా వెలిగిన ఛార్మీ ఇప్పడు కెమేరా ముందు కాకుండా కెమేరా వెనుక పనిచేస్తున్నారు. ‘శ్రీ ఆంజనేయం’, ‘మాస్’, ‘చక్రం’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’ ‘మంత్ర’ `లక్ష్మి` వంటి చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచమైంది. ఇప్పుడు ఛార్మి.. పూరీ కనెక్ట్స్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవలే తాను ఎందుకు కెమేరాకు దూరంగా ఉన్నారు? వివాహం ఎందుకు చేసుకోలేదనే అంశాలను ఓ ఆంగ్ల ప్రతికతో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే ‘ప్రస్తుతం నేను చేస్తున్న పని నాకెంతో నచ్చింది. అసలు నేనెందుకు ఈ పని చేస్తున్నాను? అని ఎప్పుడూ నన్ను నేను ప్రశ్నించుకోలేదు. కేవలం సినిమాలే కాకుండా ఇతర విషయాలు చర్చించే అవకాశం వచ్చింది. కెమెరాను మిస్సవుతున్నానని అన్పించలేదు. ఎందుకంటే కెమేరా వెనక ఉంటూ పనిచేయడం కూడా నాకు నచ్చింది. నాకు మంచి స్క్రిప్ట్ దొరికితేనే సినిమా చేస్తాను’
‘ఒకరికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అనుకోకుండా నా జీవితంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నేను ఏం పనులు చేస్తున్నానని ప్రశ్నిస్తే సహించను. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. రెండు విషయాల వల్ల అతనితో ప్రేమ విఫలమైంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే ఆ రెండు విషయాల వల్ల విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడేది. అతను మంచివాడే. నేనే చెడ్డదాన్ని. త్వరగా పెళ్లి చేసుకోమని అమ్మ ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌లోనే సరిగ్గా ఇమడలేని నేను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాను. ఒకవేళ చేసుకున్నా ఆయన కోసం సమయం కేటాయించలేను. ఇంటి పనులు చూసుకోలేను.’
‘పెళ్లిపై నాకు నమ్మకం లేదు. నా విషయంలో అది జరగని పని. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్‌లో నేను లేను. నేనేంటో మా నాన్నకు తెలుసు. అందుకే నా తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నాను’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకున్నారు ఛార్మి.