ఉద్యోగ విరమణ సభలో ఎంఎల్‌సి లక్ష్మణరావు
చీరాల : గత 38ఏళ్లుగా బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారిగా వివిధ ప్రాంతాల్లో మిధులు నిర్వహించి గత నెల 31న ఉద్యోగ విరమణ పొందిన బండారు హరిప్రసాద్ వృత్తిపట్ల నిబద్దత కలిగిన వ్యక్తి అని ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు అన్నారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో హరిప్రసాద్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఆదివారం జెవివి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ హరిప్రసాద్ విద్యార్ధి దశ నుండి ఉద్యమాల్లో ఉంటూ ఉద్యోగం పొందినప్పటికీ వృత్తిపట్ల నిబద్దతతో పనిచేశారని అన్నారు. వృత్తిపరంగా వస్తున్న అనేక రకాల సమస్యలపైన పోరాటం నడిపారని అన్నారు.
ఎన్జీఒ నాయకునిగా, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం నాయకునిగా, ఇతర ఉద్యోగ, కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తూ అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. తను ఎక్కడ పని చేసిన తమ విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటంలో మంచి గుర్తింపు సాధించారని అన్నారు. అందువల్లనే తన సర్వీసులో ఆరు సార్లు ఉత్తమ అధికారిగా అవార్డు పొందారని అన్నారు. హరిప్రసాద్ శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. అనంతరం హరిప్రసాద్, కుసుమ కుమారి దంపతులను ఘనంగా సన్మానించారు. సభకు జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా రామరావు అధ్యక్షత వహించారు. సభలో చినగంజాం తహశీల్దారు జీవిగుంట ప్రభాకరరావు, యుటిఎఫ్ నాయకులు బండి భిక్షాలుబాబు, గౌరాబత్తిన సూరిబాబు, సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ గంగయ్య, ఎన్ బాబూరావు, సీహెచ్ సురేష్, సీహెచ్ శేషుబాబు, కె వీరాంజనేయులు, వెలుగొండారెడ్డి పాల్గొన్నారు.