ఒంగోలు : చీరాల నియోజకవర్గం వేటపాలెం బైపాస్ ప్రక్కన చేనేతల అభివృద్ధి, అవసరాల కొరకు 2005లో హ్యాండ్లూమ్ పార్క్ నిర్మాణానికి య50.36సెంట్ల భూమి కేటాయించారు. పార్క్ నిర్మాణానికి అప్పట్లో రూ.7.36కోట్ల నిధులు కేటాయించారు. అయితే అనివార్యకారణాలతో పార్క్ పనులు నిలిచి పోయాయి. ఆ స్థలంలో రాజీవ్ స్వగృహం, కొణిజేటి చేనేతపురి కాలనీలకు స్థలం కేటాయించారు. అవి పోను మిగిలిన య26.81సెంట్ల భూమి చేనేత పార్క్ కు ఉన్నది. చేనేత ఉమ్మడి అవసరాలకు అభివృద్ధి చేసి చేనేతలకు ఉపాధి అవకాశాలు అభివృద్ధి చేయాల్సి ఉంది.
అయితే తాజాగా జులై 08న వైయస్సార్ అర్బన్ హోసింగ్ పధకం క్రింద ఇతర పేదవారికి నివేశన స్ధలాలు ఇచ్చేందుకు ఈ నెల 1, 2, 3తేదీలలో రెవిన్యూ సిబ్బంది ఆ స్థలములో ప్లాట్లు వేసి హద్దురాళ్లు వేశారు. ఈవిషయమై గతములో శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైస్సార్సీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, ఎమ్యెల్సీ పోతుల సునీతలతో కలిసి వెళ్లి మంత్రులకు, జిల్లా కలెక్టర్ కు, జిల్లా అధికారులను కలిసి చేనేత పార్క్ స్థలం విషయాన్ని వివరించారు. ఇదే సమస్యపై సోమవారం 15న చేనేత నాయకులు, చేనేత కార్మికులు, చేనేత ప్రజా సంఘాల ప్రతినిధులు ఒంగోలు ఆర్డీఓను కలిసి చీరాల నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, పేదల నివేశన స్థలాలకు వాటిని పరిశీలించి, చేనేతలకు కేటాయించిన భూమిని ఇతరులకు కేటాయించ వద్దని కోరారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ చీరాల, వేటపాలెం తహసీల్దార్ లకు ఫోన్ చేసి ప్రభుత్వ భూములను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలకు సంభందించిన వివరాలు ఇవ్వమని కోరారు. కార్యక్రమంలో చేనేత నాయకులు, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మేడా వెంకట్రావు, పృధివి ధనుంజయుడు, అనుభం వెంకటేశ్వర్లు, దివి జయరాం, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రముఖ చేనేత నాయకులు, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుచూ చేనేత పార్క్ స్థలం వివరములతో ఈ నెల 16న చీరాల తహసీల్దార్ ను కలసి రిప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కావున చీరాల నియోజకవర్గంలోని చేనేత నాయకులు, చేనేత ప్రజా ప్రతినిధులు, చేనేత కార్మిక సంఘాలు, చేనేత కార్మికులు హాజరు కావాలని కోరారు.