Home ప్రకాశం జగన్ ప్రభుత్వం దళితుల పక్షపాతి : వైసీపీ కొండపి ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య

జగన్ ప్రభుత్వం దళితుల పక్షపాతి : వైసీపీ కొండపి ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య

326
0

వెంకట్రావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది : కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ
ప్రకాశం (సింగరాయకొండ) : పేరం వెంకట్రావు చనిపోవడం బాధాకరం. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైసీపీ కొండపి ఇంచార్జి, పీడీసీసి బ్యాంక్ ఛైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. హైదరాబాద్ నుండి కందుకూరు తీసుకొస్తున్న సమయంలో మార్గమధ్యలో లారీ క్రింద పడి మృతి చెందిన సింగరాయకొండ మండలం కనుమళ్ల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పేరం వెంకట్రావు మృతదేహానికి డాక్టర్ వెంకయ్య, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ నిరుపేద గిరిజన యువకుడు మైనర్ అమ్మాయి ప్రేమించుకుని భయపడి హైదరాబాద్ వెళ్ళిపోయారని, వారిని తీసుకువచ్చే క్రమంలో చనిపోవడం దురదృష్టమైన సంఘటనని అన్నారు. ఈ కుటుంబం తనకు బాగా తెలిసిన వారన్నారు. వారి తల్లిదండ్రులు ఇల్లు కూడా లేని నిరుపేదలని పేర్కొన్నారు. మృతుడి సోదరి మూగ అమ్మాయి. వీరిది ధీన పరిస్థితి. ఈ కుటుంబానికి ధైర్యం కల్పించడానికి సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ తాను కలిసి రావడం జరిగిందన్నారు. ఇది దళితుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అన్నారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా జగన్ ఉపేక్షించలేదన్నారు. ఈ కేసును విచారణ చేపట్టి, భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ను కలిసి మూగ అమ్మాయి అయిన మృతుడి సోదరికి ఉద్యోగం, వారి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఆర్థిక సహాయం కూడా చేయాలని కోరనున్నట్లు తెలిపారు.

కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ ఈ సంఘటన బాధాకరం అన్నారు. ఈ కుటుంబానికి ధైర్యం చెప్పమని జిల్లా కలెక్టర్ స్వయంగా తనను ఇక్కడికి పంపించారన్నారు. మృతుడి కుటుంబ పరిస్థితులను చూసిన తర్వాత, ఇక్కడి వారు మృతుడి సోదరుడు, సోదరికి న్యాయం చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ ను కలిసి వీరు కోరిన సహాయం అన్ని విధాలుగా చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుందని అన్నారు. వారివెంట సింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, ఎస్సై శ్రీనివాసరావు ఉన్నారు.