• ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
• స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో మార్టూరు ఆసుపత్రి తనిఖీ
• అభివృద్ధి పనులపై సమీక్ష, మరింత విస్తరణకు చర్యలు
• మార్టూరు ఆసుపత్రిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
• బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఎమ్మెల్యే ఏలూరి తనిఖీ
మార్టూరు (Marturu) : ప్రభుత్వాసుపత్రులు ప్రజా ఆరోగ్య దేవాలయాలని, ఇక్కడికి వచ్చే ప్రతి రోగి భరోసాతో రావాలని, నమ్మకంతో వెళ్లాలని, ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కలిగించి సేవలు అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Parchuru MLA Yeluri Sambashivarao) అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన శనివారం సందర్శించారు. పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అక్కడ పరిశుభ్రత, క్రమశిక్షణ, సేవాభావం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందేలా పర్యవేక్షణ కొనసాగిస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. చెత్తకుప్పలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత పరిస్థితులు పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. వ్యర్థాల సేకరణ, సెగ్రిగేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. పరిశుభ్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
బార్కోడ్ ఆధారిత ట్రాకింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఆసుపత్రిలో అమలవుతున్న బయోమెడికల్ వ్యర్థాల బార్కోడ్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించారు. వ్యర్థాలు సేకరించడం నుంచి నిర్ణీత ప్రాసెసింగ్ కేంద్రానికి తరలించే వరకు అనుసరించే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దశలో పారదర్శకత ఉండాలని, బార్కోడ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలవ్వాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని ఆదేశించారు.
రోగులతో మాటామంతీ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వైద్య సేవలు, సిబ్బంది స్పందన, శుభ్రత ప్రమాణాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉంటేనే రోగికి చికిత్స పూర్తయినట్లేనని, ప్రజలు నమ్మకంతో రావడం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం
బయోమెడికల్ వ్యర్థాల సెగ్రిగేషన్, సేకరణ, నిల్వ, తరలింపు విధానాలపై పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా చర్చించారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి ముప్పు తెస్తుందని హెచ్చరించారు. సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు బాధ్యతాయుత సేవలు అందించాలని చెప్పారు.
మార్టూరు ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష
ప్రభుత్వ ఆసుపత్రిని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, వైద్యులు సమన్వయంతో పనిచేస్తూ మంచి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రూ.2 కోట్లతో నూతన భవనం నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. 2024–25లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రూ.11 లక్షలతో ఆసుపత్రి భవనం మరమ్మత్తులు చేపట్టామని, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ఆవరణంలో రూ.38 లక్షలతో పోస్టుమార్టం భవన నిర్మాణం, రూ.29 లక్షలతో ఆయుష్ (ఆయుర్వేద) డిస్పెన్సరీ నూతన భవనం నిర్మాణ పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. 30 పడకలున్న ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోజుకు వెయ్యి మందికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పదిమంది కూడా రాని ఆసుపత్రికి అత్యుత్తమ సేవలతో ప్రస్తుతం రోజుకు 300 నుంచి 500 మంది రోగులు వస్తున్నట్లు పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రాష్ట్రంలో చెత్తకుప్పలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పరిశుభ్రత, సాంకేతికత, బాధ్యతాయుత సేవలతోనే ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలమని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, మార్టూరు ఆసుపత్రిని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అధికారులు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు.
చెత్త రిక్షాలు అందజేత
మార్టూరు పంచాయతీలో చెత్త సేకరణ నిమిత్తం నూతన రిక్షాలు, డస్ట్ బిన్లు అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్నెంట్ గార్గేయ, డాక్టర్ అశోక్ రెడ్డి, సిద్ధార్థ, కిషోర్, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఫరూక్, టిడిపి మండల అధ్యక్షుడు తాటి నాగేశ్వరరావు, నాయకులు ఆదినారాయణ, జనార్ధన్, రజాక్, జంపని శ్రీనివాసరావు, శివ నాగేశ్వరరావు, శివరాత్రి శ్రీను, గొట్టిపాటి వెంకట్రావు పాల్గొన్నారు.






