బాపట్ల : (DN5 News) : జిల్లాలో తీర ప్రాంత పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా మూడు రోజుల పాటు గోవాలో అధ్యయన పర్యటన చేపట్టిన కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బృందం శనివారం పర్యటనను ముగించారు. ఈ సందర్భంగా బృందం గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. దేశంలో గోవాను ప్రముఖ పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దిన విధానంపై కలెక్టర్ బృందం హర్షం వ్యక్తం చేసింది. పర్యటన సందర్భంగా అక్కడి అధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గోవా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేయగా గోవా పర్యాటక విధాన పుస్తకాన్ని ముఖ్యమంత్రి కలెక్టర్ బృందానికి అందించారు. సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.
గోవా పర్యటనలో పొందిన అనుభవాలు బాపట్ల తీర ప్రాంత అభివృద్ధిలో అమలు చేస్తామని కలెక్టర్ బృందం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఈ పాలన విధానం ప్రశంసనీయమని గోవా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఎపిలో సాంకేతిక ఆధారిత డిజిటల్ సేవల ద్వారా అమలవుతున్న పరిపాలనా విధానాలు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గోవా అధికార బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, చీరాల తహశీల్దారు కె గోపికృష్ణ, వేటపాలెం ఎంపిడిఒ ఎం రాజేష్ బాబు, జిల్లా పర్యాటక అధికారి అలీ అస్గర్ షేక్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రాజెక్టు మేనేజర్లు శివ శరణ్, షేక్ సజిత్ పాల్గొన్నారు.






