బాపట్ల (Bapatla) : బాపట్ల సూర్యలంక సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.V.VinodKumar, IAS) నేతృత్వంలోని బృందం గోవాలో రెండో రోజు అధ్యయన పర్యటన నిర్వహించింది. సముద్రం తీర పరిరక్షణ నిబంధనలు, పర్యావరణ సమతుల్యత, పర్యాటక నిర్వహణ విధానాలపై అక్కడి ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. అక్కడ అమలవుతున్న విధానాలు అవగాహన చేసుకున్నారు. పర్యటనలో భాగంగా గోవా తీర పరిరక్షణ ప్రాధికార సంస్థ అధికారులను కలిసి వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి శుద్ధి, తీర సంరక్షణ చర్యలు పరిశీలించారు. గోవా (Goa) పర్యాటక ప్రతినిధులతో సమావేశమై సముద్రతీర పర్యాటకంతో పాటు సాహస, సాంస్కృతిక, వారసత్వ ఆధారిత పర్యాటక అభివృద్ధి అవకాశాలు సమీక్షించారు. రవాణా, వసతి, పారిశుధ్య సదుపాయాలను దశలవారీగా మెరుగుపరిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని అధికారులు సూచించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బృందం కాండోలిమ్ సముద్రతీరం, కలంగూట్ సముద్రతీరం, బాగా సముద్రతీరం, మిరమార్ సముద్రతీరం, కొల్వా సముద్రతీరం ప్రాంతాలను సందర్శించారు. మౌలిక సదుపాయాలు, ఆదాయ భాగస్వామ్య విధానంలో నిర్వహణ తీరును పరిశీలించారు. అలాగే చారిత్రక ప్రాధాన్యం గల అగువాడ జైలు మ్యూజియంను దర్శించారు. పాత కట్టడాలు పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేసిన నమూనాను అధ్యయనం చేశారు. బాపట్ల తీరాభివృద్ధికి అవసరమైన కీలక అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉపాధి అవకాశాలు పెంపొందేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యటనలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి, చీరాల తహశీల్దారు కె గోపికృష్ణ, వేటపాలెం ఎంపిడిఒ ఎం రాజేష్ బాబు, జిల్లా పర్యాటక అధికారి షేక్ అలీ అస్గర్ పాల్గొన్నారు.






