కడప : రాయచోటి పట్టణం ఎరుకుల కులానికి చెందిన పూజారి ప్రియాంకను ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇంట్లో తమ తల్లీ, దండ్రులు ఒప్పుకోవడం లేదని వెళ్ళి చచ్చిపోమని గెంటివేసిన రాజశేఖరరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. అవమానం భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నంకు పాల్పడిందని పేర్కొన్నారు. రెండు నెలలు నుండి కోమాలో ఉంటూ కడప, బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరకయాతనకు గురైందని తెలిపారు. ఇప్పటివరకు వైద్యానికి రు.20లక్షల ఖర్చు అయినప్పటికీ కోలుకోలేదన్నారు. ఇంట్లోనే వైద్యం చేయించు కుంటున్న ప్రియాంకను పరామర్శించారు.
ఈ సందర్భంగా కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఖర్చుయిన రు.20లక్షలకు బిల్లులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవ్వాలని కోరారు. ఆధిపత్య కులానికి చెందిన రాజశేఖరరెడ్డి ఆస్తులు జప్తు చేసైనా బాదిత కుటుంబానికి ఇప్పించాలని కోరారు. ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు రెండున ప్రియాంక తల్లీ, దండ్రులు రాయచోటి పోలీసులకు తమ అమ్మాయిని కిడ్నాప్ చేసారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. కాలయాపన చేసి డిశంబర్ 25న ముద్దాయిలపై కేసు నమోదు చేశారన్నారు. నిర్లక్ష్యంతో కాలయాపన చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రజాతంత్ర వాదులు, ప్రజలందరూ ఖండించాలని కోరారు.
కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, సిపిఎం రాయచోటి నాయకులు రామాంజనేయులు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.