Home సినిమా అల్లు-మెగా కుటుంబాల మధ్య గ్యాప్‌ వచ్చిందా?

అల్లు-మెగా కుటుంబాల మధ్య గ్యాప్‌ వచ్చిందా?

293
0

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి-అల్లు అరవింద్‌ కుటుంబాలే ఙ్ఞప్తికి వస్తాయి. అంతలా ఈ ఫ్యామిలీల మధ్య బంధం అల్లుకుపోయింది. అయితే ఇప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందనేది టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా జరుగుతోన్న చర్చ.

చిరంజీవిని మెగాస్టార్‌గా తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక అల్లు అరవింద్‌దే. తన బావ చిరంజీవితో ‘శుభలేఖ’, ‘విజేత’, ‘పసివాడి ప్రాణం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘మాస్టర్’ వంటి విజయవంతమైన చిత్రాలు తీశాడు అరవింద్. అంతేకాకుండా చిరంజీవి వేరే నిర్మాతల సినిమాల్లో నటించినా ఆ చిత్రాల ఎంపిక వెనుక కూడా అరవింద్ హస్తం ఉందనేది కాదనలేని సత్యం. అలా చిరు కెరీర్‌ ఆద్యంతం వెన్నంటే ఉన్న అల్లు అరవింద్‌కి అవమానం జరగడం వల్లనే మెగా-అల్లు కాంపౌండ్‌ల మధ్య గ్యాప్‌ పెరిగిందనేది ఫిల్మ్‌నగర్ టాక్.

బయట నిర్మాతలకు సినిమాలు చేసినా ఏడాదికో, రెండేళ్లకో ఖచ్చితంగా అల్లు అరవింద్‌తో సినిమా చేసేవాడు చిరంజీవి. అలాంటిది కమ్‌బ్యాక్‌లో గీతా ఆర్ట్స్‌
మాటే మర్చిపోయాడు. చిరంజీవి రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత నటించిన ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ చిత్రాలను రామ్‌చరణ్ నిర్మించాడు. ఇప్పుడు చేయబోతున్న కొరటాల శివ సినిమాకి కూడా చెర్రీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే గతంలో ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తానని చెప్పాడు చిరంజీవి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు ప్రాజెక్టును ప్రిస్టేజియస్‌గా నిర్మించాలనుకున్నాడు అల్లు అరవింద్. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. పోనీ కొరటాల శివ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలసి నిర్మిద్దామనుకున్నా ఆ ఛాన్స్‌ మేటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కొట్టేసింది. ఈనేపథ్యంలో అల్లు అరవింద్.. చిరంజీవిపై అలిగాడని అందుకే ఈ రెండు కుటుంబాలు ఈ మధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా మెగా కాంపౌండ్‌లోని కొంతమంది హీరోల మధ్య సయోధ్య లేదని అప్పుడప్పుడూ వినిపించడం, ఆ తర్వాత వారు మళ్లీ కలసిపోవడం జరిగిందే. ఆ తరహాలోనే అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి భారీ ప్రాజెక్టును ప్రకటించి ఈ
మెగా-అల్లు గ్యాప్‌కి ఫుల్‌స్టాప్ పెడతాడేమో చూడాలి.