Home బాపట్ల గంజాయి ముఠా హంతకులను కఠినంగా శిక్షించాలి : కె ధనలక్ష్మి

గంజాయి ముఠా హంతకులను కఠినంగా శిక్షించాలి : కె ధనలక్ష్మి

21
0

బాపట్ల (Bapatla) : నెల్లూరులో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యపై కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేయడం హేయమైన చర్యని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో పెంచలయ్య హత్యను ఖండిస్తూ ఆయన చిత్రపటంతో పాత బస్టాండు సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం గంజాయి ముఠా చేసిన దాడిలో ప్రజా నాట్య మండలి కళాకారుడు, డివైఎఫ్‌ఐ మాజీ నేత, సిపిఎం కార్యకర్త కె పెంచలయ్య (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. హత్యకు కారకులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న పెంచలయ్య నెల్లూరు రూరల్‌లో ప్రజానాట్య మండలి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

నెల్లూరు నగరంలో ఇటీవల విచ్చలవిడిగా పెరిగిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలు, యువతను చైతన్య పర్చడానికి అనేక కళారూపాలు రూపొందించి ప్రదర్శించారని అన్నారు. పోలీసుల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడని తెలిపారు. గంజాయి మానండంటూ స్థానికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది స్థానిక గంజాయి ముఠాకు మింగుడు పడలేదని అన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసిన ఆ ముఠా పకడ్బందీగా ఓ పథకం రూపొందించి హత్య చేశారని ఆరోపించారు. ఆ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను కూడా కత్తులతో బెదిరించారని అన్నారు. కత్తుల దాడితో నెత్తుటి మడుగులో కుప్పకూలిన పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందారని అన్నారు. ఈ సంఘటనతో ఆయన వెంట ఉన్న పిల్లలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు.

పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితులు దగ్గరకు వెళితే పోలీసులపైనే కత్తులతో దాడి చేసిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదన్నారు. పోలీసులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఈ ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. పెంచలయ్యపై దాడి చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం వసంతరావు, సిహెచ్ మజాందర్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పి కొండయ్య, సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్, మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ జిల్లా కార్యదర్శి శామ్యూల్, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ఐఎల్టిడి కంపెనీ ఫెడరేషన్‌ కార్యదర్శి జి సుధాకర్, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

చీరాల (Chirala) : నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వివిధ కళారూపాలతో చైతన్యం నింపిన యువ కళాకారుడు, సీపీఎం కార్యకర్త, డివైఎఫ్ఐ నాయకుడు కామ్రేడ్ పెంచలయ్యను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ, ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడుతూ ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పెంచలయ్య పనిచేస్తున్నట్లు చెప్పారు. చీరాలలో కూడా గంజాయి మాఫియా అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటన గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తం డ్రగ్ మాఫియా చెలరేగిపోతోందన్నారని అన్నారు. పెంచలయ్య హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కన్వీనర్ బూదాటి వెంకట్‌కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం వసంతరావు, డివైఎఫ్ఐ నాయకులు జి బాలకృష్ణ, జెవివి నాయకులు డి నారపరెడ్డి, సిఐటియు నాయకులు జి ఇమ్మానియేల్, జి క్రాంతి సాగర్, కె నీలాంబరం, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎన్ సూర్యకుమార్, పి శ్రీనివాసరావు, బి అబ్రహం, ఎస్‌కె జిలానీ, దేవర వెంకటేశ్వర్లు, శేషయ్య పాల్గొన్నారు.