అద్దంకి (DN5 News) : అద్దంకి నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రోడ్లు & భవనాలు శాఖ ద్వారా నియోజకవర్గంలోని మొత్తం 11 రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 6.05 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి గొట్టిపాటి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. అద్దంకి అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు.
మంజూరైన ప్రధాన పనులు :
• ముప్పవరం బైపాస్ నిర్మాణానికి రూ.2.15 కోట్లు
• మేదరమెట్ల – రాచపూడి రహదారి అభివృద్ధికి రూ. 2.30 కోట్లు
• ఇతర కీలక రహదారి పనులకు రూ. 1.75 కోట్లు
ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు ప్రత్యక్షంగా లాభపడతారని మంత్రి తెలిపారు. పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా అద్దంకి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.






