చీరాల : ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు రామానందసరస్వతి ఆధ్వర్యంలో వాడరేవు ఆశ్రమంలో ఉచిత షుగరు వైద్యశిభిరం నిర్వహించారు. గత రెండున్నర సంవత్సరాలుగా షుగరు వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా వైద్యశిభిరం నిర్వహించడమే కాకుండా నెలరోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో షుగరు వ్యాధి ఉన్న పేదలకు మందులు కొనలేమన్న భయం లేకుండా నిశ్చింతగా ఉంటున్నట్లు రోగులు చెబుతున్నారు.
వైద్యశిభిరానికి రెండువేలకుపైగా రోగులు వస్తుండటంతో పరీక్షలు చేయడం ఆలస్యమై ఇబ్బంది పడటాన్ని గమనించి నమోదు చేసుకున్న రోగులను రెండు బ్యాచ్‌లుగా చేసి ఒక నెల ఒకబ్యాచ్‌కి, తరువాతనెల మరో బ్యాచ్‌కి వైద్యపరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ వైద్యశిభిరానికి వచ్చేవరకు అంటే పరీక్షలు చేయించుకున్న రోగులకు రెండునెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. వైద్యశిభిరంలో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలితప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్ వైద్యపరీక్షలు చేశారు. వైద్యశిభిరానికి హాజరైన రోగులు ఇబ్బందులు పడకుండా అల్పాహారం, తాగునీటి వసతులను కల్పించారు. కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, మేనేజర్ ఎన్ సురేష్, ఎంజి శంకరరావు, ఎ సురేష్, వాడరేవు జెడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్ధులు సేవలందించారు.