కొండపి(దమ్ము) : రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 22రైతుల పాలిట ఉరితాడుకాబోతుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూనంనేని రాములు భవనంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. సమావేశానికి గురవయ్య అధ్యక్షత వహించారు. వీరారెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్ మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం రైతులకు నష్టదాయకమన్నారు. రైతుల పక్షపాతినని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేసినటువంటి ఉచిత విద్యుత్ కు తిలోదకాలు ఇచ్చి వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు, నగదు బదిలీ చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని అన్నారు.
ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు రైతుల ఆగ్రహానికి గురై 2004లో పదవిని కోల్పోయిన విషయన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఉద్యమ ఫలితంగానే నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి ఉచిత విద్యుత్తు అమలకు మొదటి సంతకం పెట్టిన విషయాన్ని జగన్ గుర్తుంచు కోవాలని తెలిపారు. 2013లో కిరణకుమార్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ రోజు పెద్ద ఎత్తున సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటు నోరు మెదపకపోవడం విచారకరమని అన్నారు.
రాజశేఖరరెడ్డి ఆదర్శంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి తండ్రి వర్ధంతి సందర్బంగా సెప్టెంబర్ 5వ తేదీన ఉచిత విద్యుత్తుకు తిలోదకాలు ఇచ్చే విధానాలను ప్రకటించటం దురదృష్టకరమన్నారు. విద్యుత్తు పంపిణీ మొత్తం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబితే రైతులు కరెంటు బిల్లులు కట్టని పక్షంలో ఈ స్మార్ట్ మీటర్ల వలన వెంటనే డిస్కనెక్ట్ అవుతుందని, దీనివల్ల రైతాంగం పంటలను కోల్పోయి తీవ్ర నష్టానికి లోనవుతారని వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలను యధాతథంగా అమలు జరిపితే రాబోయే 30సంవత్సరాల వరకు ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్తున్న జగన్ మాటలు నీటి మూటలేనని అన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు కృష్ణారెడ్డి, టిడిపి మండల నాయకులు గోదావరి సోమయ్య, సిపిఎం మండల కార్యదర్శి మస్తాన్, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు నాగరాజు, డిబిఎంఎస్ అధ్యక్షులు కోటయ్య, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంకట్రావు, మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మి, వందనం, నాగభూషణం, చంద్రశేఖర్, కాసిం, రాజు, సత్యం, వెంకట్రావు పాల్గొన్నారు.