– రోటరీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ
– పేదలకు అండగా రోటరీ ఉంటుందన్న ప్రెసిడెంట్, సెక్రెటర రమణ, దేవరాజు
చీరాల : పేదలకు ఆహారం అందజేసి కొంత మేరకైనా చేయూత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రోటరిక్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డ మల్లికార్జున సహకారంతో కృపానగర్ లో 200మందికి సాంబార్ అన్నం, పెరుగన్నం, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు చేయూత నివ్వటం ప్రతిఒక్కరి ధర్మమని, ఆవిధంగా చేయటం భగవంతుని సేవతో సమానమని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర పేదలు పనులు లేక ఆహారం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వారికి గురువారం ఆహార పోట్లాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ కరోనా మానవాళికి తీరని కష్టాలను తెచ్చి పెట్టిందన్నారు. అయిన అందరం ధైర్యంతో దీనిపై పోరాడి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలని కోరారు. పేదలు అధైర్యపడవద్దని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు. లాక్డౌన్ కాలంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రావి వెంకట రమణరావు, హేమంత్ కుమార్, పాండురంగారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.