అమరావతి : ఏపీలో రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా వరదలు మాత్రం బీభత్సం సృష్టించాయి. రాజధాని ప్రాంతాన్ని ముంచేశాయి. వరద పోయింది. కానీ వరద తెచ్చిన రాజకీయ బురద మాత్రం ఆరలేదు. అధికార, ప్రతిపక్ష నేతల తీరుతో రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అధికార పార్టీ నేతలు సృష్టించిన ఈ గందరగోళాన్ని ప్రతిపక్ష పార్టీలు వాటికి అనువుగా మార్చుకున్నాయి. రాజధానిని తరలించే ప్రయతాన్ని అడ్డుకుంటామని, ఊరుకోమని, ధర్నాలకు దిగుతామనే హెచ్చరికలు రైతుల్లోని గందరగోళాన్ని మరింత పెంచాయి. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ అధినేత నుంచి మాత్రం ఒక్క కామెంట్ కూడా రాలేదు. కానీ ఆ పార్టీ నేతలు ఇప్పటికీ రోజుకో మాట చెబుతూ రాష్ట్ర ప్రజల్లో గందరగోళం పుట్టిస్తూనే ఉన్నారు.
తారా స్థాయికి రాజకీయ రగడ
ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ రగడ తారా స్థాయికి చేరుకుంది. విభజన తర్వాత ఏపీకి రాజధాని ఏర్పడింది. తొలి ప్రభుత్వ పాలన జరిగింది. ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. రాష్ట్రవిర్భావం తర్వాత రెండో ఎన్నికల్లో కొత్త పార్టీకి పగ్గాలు అందాయి. ప్రభుత్వం పాలన కూడా కొనసాగిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా సీఎం ప్రమాణం స్వీకరం నుంచి అసలు కథ ప్రారంభమైంది. ఆయన పీఠం ఎక్కిన కొన్ని రోజులకే ప్రజా వేదికను కూల్చడంతో అక్రమ కట్టాలపై చర్యలు తీసుకోవడం ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లు మద్య నిషేధం, పేదల ఇళ్ల పట్టాలు, పింఛన్లు వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చారు. కానీ ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న రాజధాని అభివృద్ధిపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేదు. గత ప్రభుత్వం వందల వేల కోట్లు వెచ్చిస్తే నూతన సీఎం కేటాయింపులు పెద్దగా చేయలేదు. సంతృప్తి పరిచినట్లులేదు. అభివృద్ధి విషయం అలా ఉంచితే.. తాజాగా వచ్చిన వరదలు రాజకీయ చిచ్చు పెట్టాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షపు నీరు అమాంతం వచ్చి ఏపీ రాజధానిపై పడటం అసలు రాజకీయ రగడకు కారణమయ్యాయి. రాజధానిలో దాదాపు అన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అటు అమరావతిలోని బుద్ధుడి విగ్రహాన్ని కూడా వరద చుట్టేసింది. ఆ తర్వాత బురద రాజకీయం రగులుకుంది.
రాజధాని సేఫేనా?
అసలు రాజధాని ప్లేస్ కరెక్టేనా? ఇక్కడ యోగ్యమేనా? గత ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయి. దీనంతటికీ అప్పటి ప్రభుత్వ అధినేతే కారణమంటూ అధికార పార్టీకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత రాజకీయ రగడకు హద్దులేకుండా పోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల మంటల యుద్ధం నుంచి కార్యకర్తల కొట్లాట వరకూ సాగింది. వీళ్ల మాట అటు ఉంచితే రాజధాని ప్రాంత వాసులు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాయకులు ఎలా ఉన్నా గానీ రాజధాని మాటేంటనే ప్రశ్నలు, అనుమానాలు వాళ్లకు నిద్ర లేకుండా చేశాయి. రైతుల్లో రాజధానిని మార్చేస్తారేమోననే భయం పట్టుకుంది. వరదలను మర్చిపోయినా రాజకీయ నేతల కామెంట్స్ వాళ్లలో కలవర పెడుతూనే ఉన్నాయి. ఏ ఒక్క నేత కూడా రాజధానిపై స్పష్టంగా మాట్లాడకపోవడం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆయన ఎందుకు మాట్లడరు?
అసలు ఆయన ఎందుకు మట్లాడటంలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. తొలుత రాజధాని అమరావతిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజధానిపై ఓ కీలక కమిటి ఇచ్చిన నివేదికను అప్పట్లో సమర్థించారు. రాజధాని అక్కడ సేఫ్ కాదనే కామెంట్స్ కూడా చేశారు. కానీ అమరావతికే తలవంచారు. రాజధాని అమరావతికి తాను కూడా కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు బంపర్ మెజార్టీతో రాష్ట్ర రథ సారథిగా ఉన్నారు. రాజధాని అంశం రాష్ట్రంలో పరిథిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజధానిని మారుస్తారేమో అనే కన్ ఫ్యూజన్ ప్రజల్లో ఏర్పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు, కడప, కర్నూలు వరకూ గందరగోళం నెలకొంది. రాయలసీమను పక్కన పెడితే కోస్తాంధ్రలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేక భావన ఏర్పడందన్న విషయాన్ని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కోస్తాంధ్రకు అమరావతి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రాజధానిని తరలిస్తామంటే కొంతభయం, ఆందోళన సహజం. మరి అధినేత మదిలో మాత్రం ఏముందనేది ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్న. జేరూసలెం పర్యటన అయిపోయింది. ఆంధ్రాలో పరిపాలన సాగిస్తున్నారు. మరి ఎందుకు రాజధాని తరలింపు, మార్పు అంశాన్ని నాన్చుతున్నారు.
రెండు సామాజికి వర్గాల వల్లేనా ఇదంతా?
రాష్ట్ర విభజనకు ముందు కొంతమంది నాయకులు, రెండు సామాజిక వర్గాల రియర్టర్లు రాష్ట్రంలో భూములు కొన్నారు. రాజధాని అక్కడ, ఇక్కడ అనే ప్రకటనలతో భూమ్ ఉన్న చోట భూములు, ఇళ్ల స్థలాలు కొన్నారు. అలా రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు, నేతలు అమరావతిలో కొనుగోళు చేస్తే మరికొందరు ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర కొన్నారు. అమరావతి దగ్గర కొన్నవాళ్లకు లాభాలు వస్తే దొనకొండ వద్ద కొంత నష్టాలను కలిగించాయి. ముఖ్యంగా దొనకొండలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు వేల ఎకరాల వరకు భూములు కొన్నారనేది అక్షర సత్యం. ఇప్పుడు రాజధానిని దొనకొండకు షిఫ్ట్ చేస్తే ఆ భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ఆర్థికంగా బలపడొచ్చనేది ఓ సామాజిక వర్గం భావన. అమరావతి వద్ద వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసి వాటితో లాభపడుతున్న మరో సామాజిక వర్గాన్ని కూడా దెబ్బతీయొచ్చనేది మరో భావన. ఈ రెండు సామాజిక వర్గాల ఆర్థిక ఆధిపత్యం కోసమే రాజధాని తరలింపు అనే విషయాన్ని తీసుకొచ్చారనే అంశంతాజాగా వినపడుతోంది.
ఓ సామాజిక వర్గం కుట్ర చేస్తోందా?
మరో అంశం కూడా తాజాగా ఆసక్తిని కలిగిస్తోంది. నిన్న, మొన్నటి వరకూ రాజధాని పరిథిలో రియల్ ఎస్టేట్ కొంతవరకూ పుంచుకుందనే చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి అస్పష్ట ప్రకటనలతో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రాజధాని మారుస్తారన్న ఆందోళనలతో భూముల ధరలు తగ్గిపోతాయి. గతంలో ఓ సామాజిక వర్గం కొన్న భూములకు కూడా ధరలు పడిపోతాయి. వాటిని దక్కించుకుని రేట్లు పెంచుకోవాలనేది మరో సామాజిక వర్గం ఆలోచన. అలా ఆర్థికంగా బలపడొచ్చు. ప్రత్యర్థి సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టొచ్చనేది కూడా మరో ఎత్తుగడ. మరి ప్రభుత్వ అధినేత రాజధాని తరలింపు విషయంపై స్పష్టత ఇస్తారా.? లేదా రెండు సామాజిక వర్గాల చదరంగంలో నీరో చక్రవర్తిలా ఉంటారా అనేది చూడాలి. కానీ స్పష్టత ఇవ్వకపోతే రాజధాని ప్రజల నుంచి కొంత వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది.
ప్రాంతీయ సమానత్వ దిశగా అభివృద్దే…
రాజధాని అభివృద్ధి పేరుతో నిధులన్నీ ఒకేచోట పొగుచేసి తెచ్చే అభివృద్ధి భవిష్యత్ లో మరో ప్రాంతీయ ఉద్యమానికి దారితీస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. తెలంగాణ ఉద్యమం తో వదులుకోవాల్సి వచ్చింది. ఆడేతరహ అభివృద్ధి చేస్తే మేము వెనుకబడ్డామని రాయలసీమ, కాదు మేము వెనుకబడ్డామని ఉత్తర కోస్తా, అన్నిప్రాంతాలకు ఏదో ఒకటి చేశారు కానీ ప్రకాశం జిల్లాకు ఒక యూనివర్సిటీ కూడా లేదని, వెనుక బడింది మేమేనంటూ ప్రాంతీయ ఉద్యమాలు పురుడు పోసుకునే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాల ఆర్ధిక ఆధిపత్యం కోసం అస్థిరమైన ప్రకటనలతో కలిగించే అపోహలు ఈ పాటికె నష్టం కలిగించాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తిని కోల్పోయేలా చేశాయి. ఆస్పష్టమైన ప్రకటనలతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రశ్నఅర్ధకం చేయవద్దనేది అందరిలో వినిపిస్తుంది. అందుకే త్వరగా ప్రకటన చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం.