– కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన యోధురాలు : తాడివలస
– మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితంలోనూ… అశయాలలోను సగభాగం : పరమేష్
– మనువాద పెత్తందారీ పోకడలను చిత్తుచేసిన ఫూలే దంపతులు : శ్రీకాంత్ టకూర్,
చీరాల : దేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా శూధ్రులు, అతి శూద్రులు, అనచబడుతున్న కులాల వారికి విద్యను అందించి దేశ ప్రగతికి పునాదులు వేసిన సావిత్రిబాయి ఫూలే 189వ జయంతి సందర్భంగా చీరాల బిసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు ఘన నివాళులు అర్పించారు.
చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన రావు మాట్లాడుతూ 1831 జనవరి 3న ఖండోజి, లక్ష్మి దంపతులకు మహారాష్ర్టలో కవాడి గ్రామంలో జన్మించిన, తన జీవిత భాగస్వామి సావిత్రీబాయికి విద్యావసరతను పూలే గుర్తించాడు. ఆమె ఆసక్తి దోహదపడింది. కేశవ్ శివరాం భావాల్కర్ సహాయంతో ఆమెను విద్యావంతురాలిగా చేశాడు. సుగుణబాయి సహకారంతో సావిత్రిబాయి 1847లో మహర్వాడ (ఎస్సి)లో బాలికా పాఠశాలను ప్రారంభించారు. ‘మనువు పెట్టిన ఆంక్షలన్ని నిజం కాదు. వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు. రండి. చదువుకోండి, చేయూతనిస్తాం. చదువు మీకు ఆనందాన్నీ, విజ్ఞానాన్ని ఇస్తుంది. సందేహించకండి…’ అంటూ వాడల్లో తిరిగి ప్రచారం చేస్తూ నచ్చ చెప్పి బాలికలను పాఠశాలకు తోడుకొని వచ్చేవారు సావిత్రిబాయి తెలిపేరు.
బీసీ నాయకులు సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ
సావిత్రీబాయి పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో బ్రాహ్మణ వర్గాలు పేడ, రాళ్లు, గుడ్లతో కొట్టి అవమానించేవారు. అయినా ఆమె ఏనాడూ చలించలేదు. ఇలా పూణే చుట్టుప్రక్కల అంటరాని బాలికల విద్య కోసం దాదాపు 18 పాఠశాలలు స్థాపించి, నిజమైన విద్యాదేవతలుగా నిలిచారు ఫూలే దంపతులు.
తాడివలస దేవరాజు మాట్లాడుతూ కేవలం బాలికలకు విద్యనందించే కార్యక్రమమే కాక వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల సమస్య, సతీసహగమనాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు సావిత్రిబాయి. వితంతువులకు బోడిగుండు కొట్టించి, చీకటి గదులకు పరిమితం చేసే అమానవీయ విచారకర విషయాలను తీవ్రంగా ఖండించారు.
పరమేష్ బీరక మాట్లాడుతూ తరతరాల అంధకారానికి చరమగీతం పాడి, మనువాద పెత్తందారీ పోకడలను చిత్తుచేసి నూతన సామాజిక విప్లవానికి పాదులు వేసిన ఫూలే దంపతులు ‘వ్యధాకులితమైన సంఘర్షణ సృజించిన’ మహోతన్న ఆదర్శమూర్తులు నేటికీ ఆచరణీయులు, అనుసరణీయులు అని అన్నారు. కార్యక్రమములో సిపిఐ కార్యదర్శి మెడ వెంకట్రావు, బిసి ఫెడరేషన్ నాయకులు తాడివలస దేవరాజు, శ్రీకాంత్ టకూర్, కర్ణ హనుమంతరావు పాల్గొన్నారు.