. గొర్రెలమందపై దూసుకు వెళ్లిన డిజైర్ కారు
. 48 గొర్రెలు అక్కడికక్కడే మృతి
. మరో 16 గొర్రెలకు తీవ్ర గాయాలు
. తాళ్లూరు, ముండ్లమూరు మండలాల గొర్రెల యజమానులు
. రూ.14 లక్షల మేర ఆస్తి నష్టం
. అతివేగమే ప్రమాదానికి కారణం
. కారులో ఉన్నవారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు
పర్చూరు (DN5 News) : మండలంలోని దేవరపల్లి సమీపంలో పిడుగురాళ్ల, వాడరేవు 167ఎ జాతి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని గొర్రెల యజమానులు తెలిపారు. దేవరపల్లి బస్ స్టాప్ సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందపైకి చీరాల వైపు నుండి పర్చూరు మీదుగా చిలకలూరిపేట వెళుతున్న డిజైర్ కారు ఒకసారిగా గొర్రెల మందను ఢీకొట్టింది. ప్రమాదంలో 48 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 16 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రకాశం జిల్లా తాళ్లూరు, మండ్లమూరు మండలాల మాధవరం, సింగన్నపాలెం గ్రామాలకు చెందిన గొర్రెల యజమానులు తెల్లమేకల వెంకటేశ్వర్లు, తెల్లమేకల వెంకటరావు, మందపల్లి వీరాంజనేయులు, మోరబోకు సుబ్బారావు, కొణికి వెంకయ్యకు చెందిన గొర్రెలు మృతి చెందాయి. కారు వేగంగా ఢీ కొట్టడంతో గొర్రెలు రోడ్డుపై చల్లా చెదురుగా పడ్డాయి. ఆ గొర్రెలను ఎస్‌ఐ గోపి పోలీసు సిబ్బందితో రోడ్డు ప్రక్కకు లాగి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డు క్లియర్ చేశారు. ప్రమాదంలో కారు తిరగబడింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్, మరో ఇద్దరు ప్రాణాలు కారులోని ఎయిర్ బెలూన్లు తెచ్చుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అక్కడ నుంచి పరారీ అయ్యారు. ఒక్కొక్క గొర్రె రూ.25 వేలకు పైగానే ఖరీదు ఉంటుందని, రూ.14 లక్షలు మేర తమకు నష్టం కలిగిందని గొర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలకు భీమా లేకపోవడంతో వారు లబో దిబోమంటున్నారు.
ఇన్ని రోజులుగా తాము సాకుకుంటున్న గొర్రెలను కారు ఢీకొట్టడంతో తమ నోటి కాడ కూడు పోయిందని, గొర్రెల యజమానులు బాధలో మునిగిపోయారు. తమకు ప్రభుత్వమే సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గొర్రెలే తమకు జీవనాధారమని, వాటిని పోషించి తమ కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటున్నామని తెలిపారు. రోడ్డుపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని దేవరపల్లి, తిమ్మరాజుపాలెం, అన్నంబోట్లవారి పాలెం, ఎడారిపల్లె, పసుమరు గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ వాహనదారులు సరైన అవగాహన లేక తికమకపడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కొంతైనా వేగ నియంత్రణ జరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి గోపి తెలిపారు.






