పర్చూరు (DN5 News) : రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. మండలంలోని కోలలపూడిలో మార్క్‌ఫెడ్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ భావనతో కలిసి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రాజకీయాలకు తావులేదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతు పండించిన పంట కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంటను కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. అప్పట్లో శనగల కొనుగోలు సమయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసి రూ.లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శక విధానాలతో ముందుకెళ్తోందని అన్నారు. శనగల కొనుగోలులో రైతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పిఏసిఎస్‌లపై ఉందని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట అన్నారు. కొనుగోలు కేంద్రాలకు శనగలు తీసుకువచ్చే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ గుంజి వెంకటరావు, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, ఏడి రమేష్‌బాబు, జెడిఎ, ప్రత్యేక అధికారి లవన్న, తహశీల్దారు ప్రశాంతి, పిఏసిఎస్ అధ్యక్షుడు తాటి నాగార్జున పాల్గొన్నారు.






