– వేగం కన్నా ప్రాణం మిన్న
– నిర్లక్ష్యం, అవగాహన లేక పోవటంతోనే ప్రమాదాలు
– అనాధలుగా మారుతున్న బాధిత కుటుంబాలు.
– రోటరీ క్లబ్ క్షీరపురి కార్యదర్శి, చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ దేవరాజు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని చీరాల జిల్లా సాధన సమితి ఛైర్మన్ తాడివలస దేవరాజు కోరారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా బీవిజి, 108 రాష్ట్ర మేనేజర్ సురేష్, రాష్ట్ర 108 ఆపరేషన్ హెడ్ రామ్మోహనరావు ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ నిర్లక్ష్యం, నిబంధనల పట్ల అవగాహన లేకపోవటం వంటి కారణాలతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతుంది, మృత్యువాత పడుతుంది యువకులే కావడం బాధాకరమన్నారు. యాక్షిడెంట్లలో తీవ్రంగా గాయపడి కొంతమంది జీవితకాలం మంచానికే పరిమితం అవుతున్నారని చెప్పారు. దీనివలన కుటుంబం ఆర్ధిక పరిస్తితి చిన్నాభిన్నం అవుతుందన్నారు. కుటుంబ యజమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబ సభ్యులు అనాధలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన రోడ్డుపై వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. 108కి ట్రాఫిక్ నందు దారి ఇస్తూ ప్రాణాలను కాపాడాలని ప్రకాశం జిల్లా మేనేజర్ రాకేష్ కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మేనేజర్ పి. రాకేష్, 108 సిబ్బంది భాస్కర్, శ్రీను, సునీత్, కిషోర్, సూపర్వైజర్ విష్ణు పాల్గొన్నారు.