చీరాల (DN5 News) : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల (Womens Day) సందర్భంగా పోలీసు శాఖ వినూత్నమైన, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నిర్వహించింది. ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో మహిళా సాధికారత ప్రతిబింబించే చిత్రాలు ప్రదర్శించారు. దీని ద్వారా విద్యార్థినులకు సమాజంలో మహిళలు సాధించిన విజయాలు, వారి పోరాట పటిమను కళ్లకు కట్టినట్లు వివరించారు.
చీరాల 1టౌన్ సిఐ సుబ్బారావు స్టేషన్ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థినుల సందేహాలు నివృత్తి చేశారు. మహిళా చట్టాలపై, శక్తి యాప్ వినియోగం, అత్యవసర నంబర్లు వినియోగించాల్సిన సందర్భాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు మనోధైర్యం నింపే విధంగా పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
సిఐ సుబ్బారావు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థినులు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే సామర్థ్యం ప్రతి విధ్యార్ధినిలో ఉండాలని అన్నారు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ధీరవనితల నుంచి నేటి కాలంలో అంతరిక్షం, క్రీడలు, సాంకేతిక రంగాలు, రక్షణ రంగాల్లో రాణిస్తున్న మహిళల వరకు అందరి విజయాలు విద్యార్థినులకు ప్రేరణగా నిలవాలని అన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు.
మహిళల భద్రతకు స్టేషన్ పరిధిలో శక్తీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్లవేళలా మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ సేవలు వినియోగించుకుని తక్షణ పోలీసు సహాయం పొందవచ్చని వివరించారు. వేధింపులకు గురైన వారు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ పోలీసు యంత్రాంగం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 1టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, శక్తి టీమ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ మురళి పాల్గొన్నారు.






