చీరాల : సేవక్ సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో శనివారం దళితులు, క్రిస్టియన్, మైనారిటీ లపై దాడులు – రాజ్యాంగ పరిష్కారం అంశంపై జరిగిన సెమినర్లో మాజీ రాజ్యసభ సభ్యులు జెడి శీలం మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగంలో హక్కుగా కల్పించిన చట్టాలను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో కేంద్రంలో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారానికొస్తే దళిత క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందిస్తామని చెప్పారు. ఉన్న చట్టాలను పటిష్ట పరుస్తామన్నారు. సెమినార్ కు సేవక్ సంస్థ అధ్యక్షులు కోటి ఆనందబాబు అధ్యక్షత వహించారు. డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ దళితుల రక్షణ కోసం ఉన్న చట్టాలు కూడా దుర్వినియోగం చేసేందుకు అగ్రవర్ణాల ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారని చెప్పారు. రాజకీయ పెత్తనం నిలుపుకునేందుకు ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల నిజంగా వివక్షతో బాధపడేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో రెవరెండ్ దాసరి లుదర్ శాస్త్రి, జోసఫ్ కెరీ, ఎమ్ రత్నషేకర్, టి సంగీతారావు, ఎమ్ జాన్, జూపూడి మార్కు పాల్గొన్నారు.