Home ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

విద్యుత్ సవరణ బిల్లును తిరస్కరించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

282
0

బాపట్ల : విద్యుత్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించకుండా తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును తిరస్కరించిందని కాని ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తారని తెలుస్తోందన్నారు. అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించినట్లయితే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ ఇస్తానన్న జగన్ హామీ తుంగలో తొక్కినట్లేనన్నారు. అలానే మూడు రాజధానుల బిల్లు వాంఛనీయం కాదన్నారు.

గత అసెంబ్లీ సమావేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సమావేశాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు సాగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలోని ప్రజానీకం వరదలు, భారీ వర్షాల వలన నష్టపోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలపై పరిష్కారం పై ద్రుష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రను ఎదుర్కొంటామని మంత్రులు చెప్పడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు పాదయాత్రకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సహకరించాలన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిందన్నారు. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత 42 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అరెస్ట్ కావడం జరిగిందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించిన ఈ కేసు 2015లో నమోదు కాగా కొత్తపల్లి గీత 2019లో బిజెపిలో చేరడం జరిగిందన్నారు. ఇలా దేశంలో ఆర్థిక కుంభకోణాలకు పాల్పడుతున్న వారందరూ బిజెపిలో చేరి రక్షణ పొందుతున్నారన్నారు. బిజెపి వీరందరికీ వత్తాసు పలుకుతుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. లేపాక్షి భూములు 8వేల ఎకరాలను ఇందు కంపెనీకి ఇవ్వగా వాటిలో 4వేల ఎకరాలను తనఖా పెట్టి రూ.4800 కోట్ల రూపాయల రుణాన్ని పొందడం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని, లేపాక్షి భూములను రైతులకు అప్పచెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిపిఎం పార్టీ రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందన్నారు.

రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళు పేరుతో జగనన్న కాలనీల నిర్మాణాలు చేపట్టి త్వరగా గృహాలు నిర్మించాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి పేర్కొన్నారు. కాలనీలో ఎలాంటి వాళ్ళు మౌళిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులను త్వరగా గృహాలు నిర్మించాలి అంటూ లేకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామంటూమని చెప్పడం శోచనీయమన్నారు. తక్షణమే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఘర్షణ ల్లో కుటుంబాల్లోని మహిళలను వివాదాల్లోకి లాగడం సరికాదు అన్నారు. రాజకీయ పార్టీల నేతలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణ కు చర్యలు చేపట్టాలని రమాదేవి కోరారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో పారిశుధ్యం సక్రమంగా లేదన్నారు. సరిపడా సిబ్బంది లేక పారిశుధ్య పనులు ముందుకు సాగడం లేదన్నారు.ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి గంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ మోహన్, మణి లాల్, ఎన్ బాబురావు, వినోద్, కోటేశ్వరరావు, మంజుదార్ తదితరులు పాల్గొన్నారు.