Home ప్రకాశం ప్రజాబలం ఉంది కాబట్టే జగన్ కు అన్ని కేసులో క్లీన్ చిట్ : వైసీపీ కొండపి...

ప్రజాబలం ఉంది కాబట్టే జగన్ కు అన్ని కేసులో క్లీన్ చిట్ : వైసీపీ కొండపి ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య

520
0

ఎస్సీల్లోని ధనవంతుల పిల్లలకే దక్కుతుంది కాబట్టే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు రద్దు                                                                టంగుటూరు (దమ్ము) : వైసీపీ కార్యాలయంలో 13 మంది లబ్ధిదారులకు వైస్ఎస్సార్ ఆరోగ్య శ్రీ రు.6లక్షల 22 వేల విలువైన చెక్కులను వైసీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య పంపిణీ చేశారు. ఈసందర్బంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో బలం ఉంది కాబట్టే ప్రతి ఒక్క కేసు క్లీన్ చిట్ వస్తుందన్నారు. బిజెపి, జనసేన, టీడీపీలు కలిసి ఒక ఫ్రెంట్ లాగా జగన్ ను ఏదో చేయాలనుకుంటున్నారని ఆ పప్పులేమీ ఉడకవన్నారు. జగన్ మీద ఒక మనీలాండరింగ్ కేసు లేదు. ఒక హవాలా కేసు లేదు. వేరే దేశాల్లో డబ్బులు దాచుకునే కేసులు లేవు. బ్యాంకులను లూటీచేసిన కేసులు లేవు. బ్యాంకులను లూటీ చేయడం, హవాలా కేసులన్నీ టీడీపీ వాళ్ళవేనని, దేశం వదిలి పోయింది కూడా టీడీపీ వాళ్లేనని డాక్టర్ వెంకయ్య అన్నారు. జగన్ మీద పెట్టిన ప్రతి కేసు క్లీన్ చీట్ వస్తుందన్నారు. జగన్ మీద పెట్టిన కేసులన్నీ అవాస్తవాలని, జగన్ మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో నాశనమైందన్నారు. రఘురామకృష్ణంరాజు లాంటి వెయ్యి మంది వచ్చినా జగన్ ను ఏమి చేయలేరని అన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు శాతం ప్రజా బలం ఉందని, మంచి పనులతో పరిపాలనలో దూసుకెళ్తున్నారని అన్నారు. అది చూసి ఓర్వలేక పైనుండి కిందకి మన పార్టీ వాళ్ళ చేత వెన్నుపోటు పొడవడం జరుగుతుందన్నారు.

టీడీపీ పనైపోయిందన్నారు. ఇక ప్రజల్లోకి వెళ్లలేమనే దిగులుతో లేనిపోని అవాకులు, చెవాకులు పేలుతున్నారని అన్నారు. టిడిపిలో మిగిలిపోయిన వాళ్ళు కూడా వైసిపి గేట్లు ఎత్తితే దూకటానికి రెడీగా ఉన్నారని అన్నారు. రేపు అది జరుగుద్ది, ఇది జరుగుద్దని ఎవరినోఒకరని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఎంపీగా పక్కన పెడితే ఒక మనిషిలాగా కూడా మాట్లాడటం లేదన్నారు. జగన్ ఛరిష్మాతో గెలిచి టిడిపి వాళ్ళు రెచ్చగొట్టి పంపిస్తే లేనిపోని పనులు చేస్తుంటే దానికి తగిన శాస్తి జరిగిందన్నారు. సింగరాయకొండ షాదీఖానా టిడిపి సమయంలోనే టెండర్లు పిలిచి, నిధులు విడుదల చేశారని, వాళ్ళ నాయకుల్లో ఒకరు చేయలేక పక్కన పడేస్తే రద్దయ్యిందన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి, టెండర్లు పిలిచి త్వరలో షాదీఖానా పనులు మొదలు పెట్టబోతున్నామన్నారు. రు.12కోట్లతో రావివారిపాలెం వెళ్లే మార్గంలోని పాలేరు బ్రిడ్జి తొంభై శాతం పూర్తయిందన్నారు. ఇంకా పది శాతం పూర్తి కావాల్సి ఉందని, రు.3కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, 15 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

సంగమేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసిందే టీడీపీ అని, ఎన్నికల ఫలితాలు రాకముందు జగన్ ఇంటికెళ్లి సంగమేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే గుర్తుంచుకుని మొదటి బడ్జెట్ లో రు.5కోట్లు కేటాయించారన్నారు. ఒకప్పుడు రు.35కోట్ల వ్యయంతో ఉన్న ప్రాజెక్టు, వారం క్రితం ప్రాజెక్టు వద్దకు వెళ్లి చూస్తే రు.234కోట్ల వ్యయం అవుతుందని, రీ టెండరింగ్ కి క్రొత్త వాళ్ళను పిలిచామన్నారు. కొండపి ఆసుపత్రిలో 30పడకల నుండి 100పడకలు చేస్తానన్న స్వామి ఇంచె కూడా కదల్చలేక పోయాడన్నారు. వైసిపి ప్రభుత్వంలో రు.2కోట్లతో కొండపిలో 50పడకల హాస్పిటల్ సగం పూర్తయిందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు, కొండపి హాస్పిటల్ కోసం జగన్ ని 7సార్లు కలిసానన్నారు. కొండపి గురుకుల పాఠశాలలో రు.60లక్షలతో మూడువంతుల పనులు పూర్తయ్యాయన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఎస్సీలలోని బాగా ఉన్న వాళ్లని, నీకు(స్వామి) తెలిసిన వాళ్ళని తీసుకెళ్లి చేర్చుతున్నారని, కొద్ది మందికే అవకాశం ఉంటే ఎవరిని అంటే వాళ్ళను తీసుకెళ్ళి చేర్చుతున్నారని అన్నారు. చంద్రబాబు విద్య, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశాడన్నారు. రిక్షా త్రొక్కుకునే సామాన్య వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు హయాంలో అడుక్కునైనా ప్రయివేటు హాస్పిటల్ లో చూయించుకోవాలని అనుకునేవారన్నారు. కానీ ఈరోజు కరోనా చికిత్స ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. బెడ్లు కావాలని ఫోన్లు చేస్తున్నారని స్వామి చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. స్వామి… నీ… వాళ్లకు ఎవరికైనా కరోనా వచ్చి బెడ్లు కావాలంటే నన్ను అడిగితే ఎన్ని బెడ్లు కావాలంటే అన్ని బెడ్లు ఇప్పిస్తానని వెంకయ్య అన్నారు. ప్రతిరోజూ బెడ్లు కావాలని ఎంతోమంది తనకు ఫోన్లు చేస్తున్నారని వెంకయ్య అన్నారు.

శాండ్ మాఫియా, ఆ మాఫియా ఈ మాఫియా అంటున్నాడని, మీరు వెధవ పనులు చేశారు కాబట్టే మీకు పుట్టగతులు లేకుండా పోయి జగన్ ని 151సీట్లతో గెలిపించారని అన్నారు. జగన్ పరిపాలన బాగోలేకపోతే తిరస్కరించే వారని, ఎన్ని ఎన్నికలు పెట్టినా వైసిపీనే గెలుస్తుందాన్నారు. పంచాయతీలలో టీడీపీ కంచుకోటలను బద్దలుకొట్టి వైసిపిని ప్రజలు గెలిపించారన్నారు. ఎంపీటీసీ, జడ్పీటిసి ఎన్నికల్లో పారిపోకుండా దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవడమో, ఓడడమో తేల్చుకోవాలి సవాలు చేశారు. అలా కాకుండా ఎన్నికల్లో పోటీచేయడం లేదని వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలలోకి వచ్చి పోరాడకుండా మాక్ అసెంబ్లీ ఎందుకన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలి కానీ జూమ్ లలో పోరాడడం కాదన్నారు. స్వామి ఇవన్నీ గమనించాలని అన్నారు. టిడిపి మాట తప్పే వాళ్ళని, జగన్ మాట తప్పడు మడమ తిప్పడు అన్నారు.

చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి చివరి సంవత్సరంతో చెప్పినవి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్పినవి చెప్పినట్లు ఏడాదిలో చేశారని అన్నారు. కరోనా మూడవ వేవ్ వస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆక్సిజన్ అవసరం అయితే అర్ధ రాత్రి మూడు గంటలకైనా తనకు ఫోన్ చేస్తే బెడ్లు, ఆక్సిజన్ ఇప్పిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సూదనగుంట శ్రీహరిబాబు, బొట్ల రామారావు, కోటిరెడ్డి, మండలంలోని నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.