హైదరాబాద్, జనవరి : అత్యంత తక్కువ సమయంలో అత్యధిక గ్రంథాలు రచించిన ప్రతిభాశాలి, వైద్యులు డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభకు గుర్తింపుగా లండన్ బుక్ ఆఫ్ రికార్డ్సులో ఆయన పేరు నమోదైనది. లండన్ వేదికగా డిసెంబర్ 2న జరిగిన సభలో డాక్టర్ సాగి సత్యనారాయణను నిర్వాహకులు సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ సత్యనారాయణ
వివిధ అంశాలపై డాక్టర్ సాగి సత్యనారాయణ చూపిన ప్రతిభాపాఠవాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. భారత ప్రతిభారత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావిస్తూ 2020. డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ డైరెక్టర్ గావ్లీ ఓ పత్రం పంపారు.
మల్కాజ్‌గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనారాయణ వైద్యునిగా కొనసాగుతూనే మూడు దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిష్యం, యోగ తదితర అంశాలపై తెలుగు, ఆంగ్ల భాషల్లో 180 పుస్తకాలు రచించారు. వీటిద్వారా ఇప్పటివరకు నాలుగు గిన్నిస్ రికార్డులు దక్కించుకున్నారు. 2016 జనవరి 28న తొలిసారి గిన్నిస్ రికార్డు అందుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో రెండో రికార్డు, 2019 అక్టోబర్ 3న 3వ రికార్డు అందుకున్నారు. 2022 ఆగస్టు 22న నాలుగోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి అత్యధికంగా 111 డాక్టరేట్లను పొందారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్ 15, డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు 25 డాక్టరేట్లతోపాటు 71 వరకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలను అందుకున్నారు. కేవలం 41 ఏళ్ల వ్యవధిలోనే ఇన్ని రికార్డులు సాధించడంపట్ల ఆయన సన్నిహితులు, మిత్రులు అభినందిస్తున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 180 గ్రంధాలను రచించి 111 డాక్టరేట్లను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లు సాధించిన వ్యక్తుల్లో ఆయన ఒకరుగా నిలిచారు.