ఒంగోలు : బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం బిఎస్ఎన్ఎల్ టెలికాం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సభలో కారెం శివాజీ మాట్లాడారు. ఈ దేశంలో హక్కులన్నీ కాలరాయ బడుతున్నాయని, ప్రతిఘటించి ఆ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేనొక్కడినే కాకుండా అందరూ సహకరించాలని కోరారు. అప్పుడే మనకు మన రక్షణ కవచాలను కాపాడుకోగలుగుతామని అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు హక్కులు అనేవి బిక్షమెత్తుకుంటేరావని, నిరంతర పోరాటాల ద్వారానే సాధించుకోవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి దళిత, ప్రజా సంఘాలు, ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు. బిఎస్ఎన్ఎల్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండమూరి ప్రకాష్ సభాధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి, ప్రత్యేక ఆహ్వానితులుగా రిటైర్డ్ ఐఏఎస్, ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్ సుబ్బారావు, టిఎన్ఎస్ జనరల్ మేనేజర్ వి చంద్రసేన, బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రెటరీ పైనం ఆరోగ్యం, డీసిఎం బ్రహ్మానందం, దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్రం, విద్యార్థి జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైనం నాగరాజు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, దళిత, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.