– జీతాలు ఇవ్వకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం.
– కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
విజయవాడ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ లో పని చేస్తున్న సిబ్బందికి పది నెలల జీతాలు ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది వేతనాలు ఇచ్చి దీపావళి పండుగలో వెలుగులు నింపి తన చిత్తశుద్ధి నిరూపించు కొవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కోరారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ లో పని చేస్తున్న సిబ్బందితో జరిగిన నిరసనలో మాల్యాద్రి మాట్లాడారు. పది నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే వారి కుటుంబాలు పరిస్థితి ఏమిటని, ఇదేనా జగన్ చెప్పే సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వకపోతే ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. స్టడీ సర్కిల్ అనేది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి, కొంతమంది మేధావులు కృషి ఫలితంగా ఏర్పడిందని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నాశనం చేశారని మాల్యాద్రి అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వచ్చిన జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం, జీతాలు ఇవ్వకుండా ఉండటం అన్యాయమన్నారు. ఇదేనా తండ్రి ఆశయాలకు ఇచ్చే విలువ అని పేర్కొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ ను డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విజయవాడలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. అప్పటి నుంచి ఏడు మంది దళిత బలహీన వర్గాల ఉద్యోగులు పని చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్లేందుకు, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు వివిధ డిపార్ట్మెంట్ టెస్ట్ లకు అనుగుణంగా ఉచిత కోచింగ్ ఇచ్చేవారు. నిరుద్యోగ యువకులకు ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగపడింది. సిబ్బందికి గతంలో బ్యాంకు ద్వారా జీతాలు ఇచ్చారు. కానీ దురదృష్టం వీరికి పది నెలల నుంచి జీతాలు లేవు. ఎన్నికల కోడ్ వల్ల కోచింగ్ అపారు. ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా కోచింగ్ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో వీరందరికీ జీతాలు ఇవ్వలేదు.
నూతన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసిన ప్రయోజనం లేదని మాల్యాద్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఊరు ఊరు తిరిగి నేను వస్తున్నాను. మీకు వెలుగులు నింపుతాను అని అందరి తలలుపై చెయ్యేసి చెప్పారు. కానీ పది నెలల నుంచి జీతాలు రాకుంటే తమ కుటుంబాలు ఏలా బ్రతకాలి? అని కోరారు. స్టడీ సర్కిల్ లో పని చేసే సిబ్బందికి మొత్తం బడ్జెట్ నెలకు ఎనబై వేలు మాత్రమే. ఒక రకంగా ఒక్క మంత్రి ఓరోజు జేబు ఖర్చుతో సమానం అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, ప్రిన్సిపల్ సెక్రటరీ రవి చంద్ర, కమీషనరు హర్షవర్ధన్ జోక్యం చేసుకుని పది నెలల పెండింగులో ఉన్న జీతాలు ఇచ్చి సిబ్బంది ఇళ్లలో దీపావళి పండుగ వెలుగులు నింపాలని కోరారు. జీతాలు ఇవ్వకపోతే దశలవారీగా ఆందోళన ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బందితో పాటు కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, డివైయఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు, కెవీపియస్ రాష్ట్ర అధ్యక్షుడు పరిశపోగు రాజేష్, పిఎన్ఎమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి క్రాంతి కుమార్, కెవీపియస్ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, గణేష్, భాస్కర్, శ్రీనివాసరావు, పార్వతి, భవాని, ఆదాం, సుశీల పాల్గొన్నారు.