చీరాల : కార్తీక పౌర్ణమి సందర్బంగా సముద్ర స్నానానికి వచ్చిన భక్తులతో ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరం కళకళలాడింది. వేకువ జామునుండే భక్తులు వాడరేవు తీరానికి చేరుకున్నారు. సూర్యోదయానికి ముందే సముద్ర స్నానమాచరించారు. గంగమ్మకు దీపారాదన చేసుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సముద్ర తీరాన అయ్యప్పస్వామి భక్తులు, శివభక్తులు పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు .
శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగాయి. జ్వాలా దీప కాంతులతో శివాలయాలు భక్తులతో కిటకిటాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో శివనామం స్మరించారు. అభిషేకములతో, కుంకుమార్చనలతో విశేష పూజలు చేశారు. చలిని, మంచును సైతం లెక్క చేయకుండా వేకువజామునుండే మహిళలు సముద్ర స్థానాలు ఆచరించారు. సముద్రం వడ్డున కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తుల కార్తీక దీప కాంతులతో చీరాల సాగర తీరం దేదీప్యమానంగా వెలుగుల విరజిమ్ముతుంది. దీప కాంతులలో అయ్యప్పభక్తులు, శివ భక్తులు పాటలతో అలరించారు. జనం రద్దీగా ఉండటంతో వాడరేవు తీరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చీరాల డీఎస్పి వల్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ పహారా ఎర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచారు. బందోబస్తు పర్యవేక్షణలో రూరల్ సిఐ పి భక్తవత్సలరెడ్డి, ఎస్ఐలు ఉన్నారు.