Home బాపట్ల అవిశ్వాసం కొనసాగుతుంది : ఎంఎల్‌ఎ కొండయ్య

అవిశ్వాసం కొనసాగుతుంది : ఎంఎల్‌ఎ కొండయ్య

47
0
Oplus_16908290

చీరాల : మున్సిపల్ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై ఈ నెల 14న అవిశ్వాసం ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య చెప్పారు. స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి మద్దతు దారులైన కౌన్సిలర్లతో కలిసి ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్‌పై అవిశ్వాసం విషయంలో ప్రజలతోపాటు తమ కౌన్సిలర్లలోను అనేక అపోహలు వచ్చాయని అన్నారు. అవిశ్వాసానికి సరిపడా కౌన్సిలర్లు తమతో ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకే చైర్మన్‌ను పార్టీలోకి తీసుకున్నామని అన్నారు. చైర్మన్ కూడా తనపై పెట్టిన అవిశ్వాసంలో ఓడినా, గెలిచిన తమ వెంటే ఉంటానని చెప్పడంతో ఆహ్వానించామని అన్నారు. ఇప్పుడు వచ్చిన తాను చేసేదేమి లేదని, ఈపాటికే తమ వద్ద ఉన్న 22మంది కౌన్సిలర్లకు మాట ఇచ్చానని అన్నారు. మరి కొంత మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటానని అన్నారు.

ఈనెల 14 లోపు చైర్మన్ రిజైన్ చేస్తారా? లేక అప్పడు చేస్తారా అనేది ఆయన వ్యక్తిగత విషయం అన్నారు. చైర్మన్‌పై వ్యతిరేకత ఉంటేనే కౌన్సిలర్లు అందరూ తనతో వచ్చారని, సానుకూల పరిణామం ఉంటే ఎందుకు వస్తారని అన్నారు. చైర్మన్ తమతో ఉన్నాసరే ఆయనకి సముచిత స్థానం ఉంటుందని, అది కూడా అవిశ్వాసం తర్వాతనే అన్నారు. చైర్మన్ అభ్యర్థి విషయంలో తమ 22 మంది కౌన్సిలర్ల నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. తనతోపాటు ఎంపీ, 22 మంది కలసి ప్రతిపాదించే చైర్మన్ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు సురగాని లక్ష్మి, మల్లెల లలిత, దాసరి శారద, సల్లూరి సత్యానందం, మించాల సాంబశివరావు, ఉల్లిపాయల సుబ్బయ్య, గోలి జగదీష్ పాల్గొన్నారు.