అద్దంకి : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పరిధిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజా వేదిక శుక్రవారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 89మంది లబ్ధిదారులకు రూ.1.38 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తోన్నట్లు తెలిపారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.